భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన స్వర మాంత్రికుడు

భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన స్వర మాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్. మూడు దశాబ్దాలుగా సంగీత ప్రియులను తన పాటల పూదోటలో ఓలలాడిస్తున్న రెహమాన్ పుట్టినరోజు ఈరోజు (జనవరి 6). తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. రెహమాన్ కి తొమ్మిది సంవత్సరాల ప్రాయంలో తండ్రి మరణించడంతో.. కుటుంబ బాధ్యతను భుజానకెత్తుకున్నాడు. సంగీత పరికరాలను అద్దెకిస్తూ.. అదే సంగీత ప్రపంచంలో తన భవిష్యత్తును వెతుక్కున్నాడు. ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి వంటి పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ వద్ద గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌ గా పనిచేశాడు. పలు వాణిజ్య ప్రకటనలకు సంగీతాన్ని సమకూర్చాడు.

‘రోజా’ చిత్రంతో రెహమాన్ కి సంగీత దర్శకుడిగా అవకాశాన్ని అందించారు మణిరత్నం. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారాన్ని పొందాడు. అప్పట్నుంచీ ఇప్పటివరకూ రెహమాన్ సంగీత ప్రవాహం కొనసాగుతూనే ఉంది. భారతీయ ఎల్లలు దాటి ప్రపంచ వ్యాప్తంగా రెహమాన్ మ్యూజికల్ మేనియా మారుమ్రోగుతుంది. వందేళ్లకు పైగా కొనసాగుతున్న భారతీయ చిత్ర పరిశ్రమకు.. ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డు ఒక కల. ఆ లోటును రెహమాన్ తీర్చాడు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంతో ఏకంగా రెండు ఆస్కార్స్ కొల్లగొట్టాడు.

అంతర్జాతీయంగా గ్రామీ, బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్ వంటి పురస్కారాలు రెహమాన్ ఖాతాలో ఉన్నాయి. ఆరు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదహేడు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు రెహమాన్ కిట్టీలో ఉన్నాయి. భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో రెహమాన్ ని గౌరవించింది. సంగీత దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఇప్పటికీ పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నాడు రెహమాన్. ప్రస్తుతం ‘అయలాన్, లాల్ సలామ్’ వంటి సినిమాలతో పాటు ధనుష్ 50, రామ్ చరణ్ 16, కమల్ ‘థగ్ లైఫ్’ వంటి సినిమాలు రెహమాన్ కిట్టీలో ఉన్నాయి.

Related Posts