మన దగ్గర దమ్మున్న దర్శకులు లేరా

ఇండియన్ సినిమా ఎల్లలు దాటి ప్రపంచ వేదిక ముందు సగర్వంగా నిలుచుందీ అంటే అది రాజమౌళి ఘనత. అతను వేసిన దారిలోనే ఇప్పుడు అంతా వెళుతున్నారు. రాజమౌళిని ఆదర్శంగా తీసుకునే ఎంతోమంది దర్శకుడు బియాండ్ ద లిమిట్స్ ఆలోచిస్తున్నారు. ఆచరించి విజయాలూ సాధిస్తున్నారు. అయితే ఇదంతా ఇతర భాషల్లో. తెలుగు నుంచి రాజమౌళి తర్వాత అన్న ప్రశ్నకు సుకుమార్ మాత్రమే సమాధానంగా కనిపిస్తున్నాడు. సుకుమార్ కూడా ఒక పరిధివరకే ఆగాడు. మరి తెలుగు నుంచి రాజమౌళి ఆదర్శంగా ఓ ప్రశాంత్ నీల్, ఓ లోకేష్ కనకరాజ్, ఓ అట్లీ ఎందుకు రాలేకపోతున్నారు.. అంతెందుకు నిన్నటికి నిన్న నెల్సన్ అనే కుర్రాడు.. కేవలం మూడో సినిమాకే బాక్సాఫీస్ ను అల్లాడించాడు. అతను రూపొందించిన జైలర్ తమిళనాట అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రాల సరసన నిలిచింది. ఓ రకంగా ఈ దర్శకులు తీసిన సినిమాలన్నీ దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ ను అల్లాడించాయి. బట్ తెలుగు నుంచి అలాంటి దర్శకులు ఎందుకు రావడం లేదు అనేది పెద్ద ప్రశ్న.


ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే దర్శకులు వారి కథలను కరెక్ట్ గా కన్వే చేయగలిగితే.. నిర్మాతలు ఎంత బడ్జెట్ పెట్టడానికైనా సిద్ధంగానే ఉన్నారు. కానీ దర్శకులేరీ. ప్రశాంత్ నీల్ కు కేజీఎఫ్ రెండో సినిమా మాత్రమే. లోకేష్ కు ఖైదీ రెండో సినిమానే. ఆ మూవీ హిందీలోనూ రీమేక్ అయింది. ఆ సినిమాను ఇంటర్ లింక్ చేస్తూ మల్టీవర్స్ ను క్రియేట్ చేసి విక్రమ్ తో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఇప్పుడు లియోతో వస్తోన్న అతనిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ప్రశాంత్ నాలుగో సినిమాగా సలార్ వస్తోంది. ఈ మూవీపై ఎలాంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక నెల్సన్, అట్లీ ఇప్పుడే మొదలుపెట్టారు కాబట్టి.. వారి నెక్ట్స్ మూవీస్ కూడా బిగ్ ప్రొఫైల్ తోనే వస్తాయని చెప్పాలి.


బట్ తెలుగు నుంచి ఇలాంటి దర్శకులు ఎందుకు రావడ లేదు అనేది పెద్ద ప్రశ్న. పైగా మన తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాలను అద్భుతంగా ఆదరిస్తున్నారు. దేశంలో మనమే బెస్ట్ ఆడియన్స్ అని చెప్పుకుంటున్నాము. మరి ఇంత మంచి ప్రేక్షకులకు దర్శకులు ఇస్తోన్న సినిమాలేంటీ.. ? అంటే వీరి సింహారెడ్డి, భోళా శంకర్ కాదంటే రీమేక్ లు. యువతరం దర్శకులు మన సీనియర్ హీరోలను ఇంకా పాత కాలం నాటి ఇమేజ్ ను పట్టుకునే వేళాడుతున్నారు తప్ప.. ఆ ఇమేజ్ ను బేస్ చేసుకుని వారి ఏజ్ కు తగ్గ కథలు రాయడంలో పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. లేదంటే ఆ హీరోలే వీళ్లు చెప్పే కథలను యాక్సెప్ట్ చేయడం లేదు అనుకోవచ్చు. ఏదేమైనా మనం క్రియేట్ చేసిన వరల్డ్ మార్కెట్ లో ఇప్పటికీ రాజమౌళి మాత్రమే కనిపించడం కాస్త బాధపడాల్సిన విషయమే.రాజమౌళి ఉన్నా.. ఆయన మూడు నాలుగేళ్లకు ఓ సినిమా చేస్తున్నాడు. సుకుమార్ పుష్ప2తో దేశవ్యాప్తంగా ఏదైనా ప్రభావం చూపిస్తాడేమో కానీ.. పుష్ప కథ ఏమంత గొప్పది కాదు.


కాకపోతే ఇప్పుడు తెలుగు నుంచి ఉన్న ఒకే ఒక్క హోప్.. నాగ్ అశ్విన్. అతను రూపొందిస్తోన్న కల్కి2898 ఏడితో మరో రాజమౌళి మనకు క్రియేట్ అవుతాడు అనిపిస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండటంతో ప్రాజెక్ట్ పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అవి ఇతర ప్రేక్షకులకూ చేరాలంటే రాబోయే అప్డేట్స్ చాలా కీలకం. ఏదేమైనా మన యువ దర్శకులు తమిళ్ డైరెక్టర్స్ లా బౌండరీస్ ను ఛేదించలేకపోతున్నారు అనేదే పెద్ద ప్రశ్న.

Related Posts