అతిథి ట్రైలర్ ఎలా ఉంది..?

ఒకప్పుడు హీరోగా తిరుగులేని విజయాలు అందుకున్నాడు వేణు. స్వయంవరంతో మొదలైన అతని కెరీర్ లో మెమరబుల్ హిట్స్ చాలానే ఉన్నాయి. టిపికల్ కామెడీ టైమింగ్ తో తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. బట్ ఓ దశలో వరుసగా ఫ్లాపులు పడ్డాయి. అంతే ఉన్నట్టుండి మాయమైపోయాడు. ఆ మధ్య రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో సిఐ మురళి అనే పాత్రలో మెరిశాడు. కానీ సినిమా పోయింది. దీంతో మళ్లీ కొత్త ఆఫర్స్ రాలేదు అనుకున్నారు. బట్ అతను ఓటిటిలో బిజీ అవుతున్నాడు. వేణు నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ పేరు అతిథి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానున్న అతిథి ట్రైలర్ విడుదలైంది. విశేషం ఏంటంటే.. ఈ సిరీస్ ను ప్రవీణ్ సత్తారు నిర్మించాడు.


ట్రైలర్ చూస్తే ఇందులో వేణు ఓ రచయిత పాత్రలో కనిపిస్తున్నాడు. కంటెంట్ పరంగా 80ల నాటి కథాంశంలా కనిపిస్తోంది. ఒక అమ్మాయి చనిపోయి దెయ్యం కావడం.. వేణు ఉండే ఇంట్లోకి రావడం.. ఆ తర్వాత కొంతమందిని భయపెట్టడం.. ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం హీరో చేయడం.. ఇంతే కనిపిస్తుంది ట్రైలర్ లో. వెబ్ సిరీస్ హారర్ జానర్స్ కు తిరుగులేని క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కు తగ్గట్టుగా ఈ ట్రైలర్ ఉందా అంటే లేదు అనే చెప్పాలి. మాగ్జిమం ఒక ఇంట్లోనే చుట్టేసినట్టు కనిపిస్తోంది. మేకప్ లు కూడా పాత దెయ్యాలవే. హాంటెడ్ హౌస్ అనేది అవుట్ డేటెడ్ అని చెప్పలేం కానీ.. ఇప్పటికే చాలాసార్లు చూశాం కాబట్టి కొత్తగా అనిపించదు. బట్ సిరీస్ లో విషయం ఉండి.. ఒక్కో ఎపిసోడ్ తో అంచనాలు పెంచగలిగితే ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. పైగా ఈ మధ్య డిస్నీ వాళ్లు చేసే సిరీస్ లన్నీ బావుంటున్నాయి కూడా.


ఇక వేణుతో పాటు అవంతిక మిశ్రా, అదితి గౌతమ్, వెంకటేష్ కాకుమాను, రవివవర్మ, భద్రం తదితరులు నటించారు. భద్రం వైజి డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ఈ నెల 19నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోంది.

Related Posts