ఆర్జీవి ‘వ్యూహం‘ వెనుక సెన్సార్ స్టోరీ

సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. వెండితెరను ఏలిన ఎంతోమంది రాజకీయాల్లోనూ రాణించారు. అలాగే ఎన్నికల దగ్గరపడుతున్న వేళ ఆయా రాజకీయ పార్టీల వ్యక్తుల కథాంశాలతో సినిమాలు రూపొందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి సినిమాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కథాంశంతో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం‘ సినిమాని తెరకెక్కించాడు.

‘వ్యూహం‘ సినిమాకి మొదట సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపించారు. మధ్యలో నట్టికుమార్ ఎంటరై.. ‘వ్యూహం‘ సినిమా పూర్తిగా పొలిటికల్ కథతో తెరకెక్కిందని.. ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార పార్టీ వైఎస్సార్ సిపి వారికి, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా, ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన లకు వ్యతిరేకంగా ఈ సినిమా రూపొందిందని సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు చేశాడు. అలాగే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోలికలు దగ్గరగా ఉన్న డూప్ లను పెట్టి వ్యంగంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారని నట్టికుమార్ తన ఫిర్యాదులో తెలిపాడు.

అయితే.. అన్ని అడ్డంకులు దాటుకుని ఫైనల్ గా ‘వ్యూహం‘ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. లేటెస్ట్ గా ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా తెలిపాడు ఆర్జీవి. అంతేకాదు.. చెడ్డ కుర్రాళ్లకు బ్యాడ్‌ న్యూస్‌ అంటూ తనదైన స్టైల్లో ట్వీట్‌ చేస్తూ సెన్సార్‌ సర్టిఫికెట్‌ తో తన ఫోటోను జత చేశాడు ఆర్జీవి. సెన్సార్ సర్టిఫికెట్ ను బట్టి ఈ చిత్రం రెండు గంటల ఆరు నిమిషాల నిడివితో రాబోతున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 29న కళ్యాణ్ రామ్ ‘డెవిల్‘, రోషన్ కనకాల ‘బబుల్ గమ్‘ సినిమాలతో పాటు ‘వ్యూహం‘ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Related Posts