నాన్ స్టాప్ సక్సెస్ ల నైషధ

వరుస విజయాలు అనే మాట ఇండస్ట్రీలో అంత సులువైన విషయం కాదు. అది ఏ ఒక్కరి మీదో ఆధారపడి ఉండదు. ఈ కలెక్టివ్ ఎఫర్ట్ వల్ల కాస్త ఎక్కువ లాభాలు పొందేది హీరోలు, హీరోయిన్లు. అలా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దగ్గర్నుంచీ ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా దూసుకుపోతోంది సంయుక్త మీనన్ అలియాస్ సంయుక్త. ఈ సోమవారం తన పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన లేటెస్ట్ మూవీ డెవిల్ నుంచి ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. హ్యాపీ బర్త్ డే టు సంయుక్త మీనన్ యాజ్ నైషధ అనే క్యాప్షన్ ఇచ్చారు. అంటే ఈ చిత్రంలో తన పాత్ర పేరు నైషధ అన్నమాట.

సంయుక్త మీనన్ మళయాలీ. తన తెరంగేట్రం అక్కడే జరిగింది. తక్కువ టైమ్ లోనే వైవిధ్యమైన పాత్రలు పోషించింది. ఈ సినిమాలతో తను మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్ లోనూ మెరిసింది. ఆ ఫేమ్ తోనే తెలుగులో ఫస్ట్ మూవీగా విరూపాక్షకు సంతకం చేసింది. బట్ ఈ మూవీ బాగా ఆలస్యం అయింది. ఈ లోగా తనకు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ లో ఛాన్స్ వచ్చింది. అదే ముందుగా విడుదలైంది కూడా. భీమ్లా నాయక్ హిట్. ఆ తర్వాత వరుసగా బింబిసార, సార్, విరూపాక్ష వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది.

ముఖ్యంగా విరూపాక్ష సినిమాలో నందిన పాత్రలో జీవించేసింది సంయుక్త. ఈ సినిమాలో తన నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. హారర్ థ్రిల్లర్ గా వచ్చిన విరూపాక్షకు మెయిన్ అట్రాక్షన్ తనే. ఒక పాటలో గ్లామర్ తో పాటు సెకండ్ హాఫ్ నుంచి నటనతో కట్టిపడేసింది. క్లైమాక్స్ లో ఆమె నటన చూసి జనం జడుసుకున్నారంటే అతిశయోక్తి కాదు.

అయితే ఇన్ని విజయాలున్నా.. తను ఆశించిన ఆఫర్స్ రాకపోవడం ఆశ్చర్యం. సక్సెస్ ఉన్న ప్రతి హీరోయిన్ నెక్ట్స్ లీగ్ లోకి ఎంటర్ కావాలనుకుంటుంది. బట్ ఈ విషయంలో సంయుక్తకు టాప్ హీరోల నుంచి కాల్ రావడం లేదు. ఇది కాస్త నిరుత్సాహపరిచినా.. ఏదో ఒక ఆఫర్ మాత్రం చేతిలో ఉంటూనే ఉంది. కొన్నాళ్లుగా తెలుగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం డెవిల్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కాబోతోంది. ఆ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించబోతోన్న స్వయంభు సినిమాలోనూ తనే మెయిన్ లీడ్ చేయబోతోంది.

కొన్నాళ్ల క్రితం తన పేరు వెనక ఉన్న మేనన్ అనే సర్ నేమ్ ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. సమాజంలో సమానత్వాన్ని కోరుకునే తను సర్ నేమ్ తో ఉంటే తన వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని.. తనను ఇకపై కేవలం సంయుక్తగా మాత్రమే పిలవాలని కోరింది. బట్ ఇండస్ట్రీ ఆ విషయం పట్టించుకున్నట్టు లేదు. అందుకే డెవిల్ లోనూ సంయుక్త మేనన్ అనే వేశారు. ఏదేమైనా ఈ అందాల రాశికి మనమూ బర్త్ డే విషెస్ చెబుదాం..

Related Posts