‘భామా కలాపం 2‘ రివ్యూ

నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్‌, సీరత్‌ కపూర్‌, చైతు జొన్నలగడ్డ, సుదీప్‌ వేద్‌, అనీష్ తదితరులు
సినిమాటోగ్రఫి: దీపక్‌
సంగీతం: ప్రశాంత్ విహారి
దర్శకత్వం: అభిమన్యు
విడుదల తేదీ: 16-02-2024
స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా

ఒక సినిమా హిట్టైందంటే ఆ చిత్రానికి సీక్వెల్స్ ఎంత కామనో.. ఓటీటీ వేదికపైనా సినిమాలకు, సిరీస్ లకు కూడా సీక్వెల్స్ చాలా కామన్ గా మారాయి. ఈకోవలోనే ప్రియమణి నటించిన ‘భామా కలాపం’ మూవీ ఆహా వేదికగా విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు ఈ సినిమాకి రెండో భాగంగా ‘భామాకలాపం 2’ వచ్చింది. ఈరోజు (ఫిబ్రవరి 16) నుంచి ఆహా ఓటీటీ వేదికగా ‘భామా కలాపం 2’ స్ట్రీమింగ్ అవుతోంది.

పెళ్లి తర్వాత అవకాశాల విషయంలో మరింత దూసుకుపోతుంది ప్రియమణి. ఒకవైపు సినిమాలతో పాటు బుల్లితెరపైనా దూకుడు పెంచింది. మరోవైపు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. రెండేళ్ల క్రితం ఫిబ్రవరిలోనే ఆహా వేదికగా విడుదలైన ‘భామా కలాపం’ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

అనుపమ మోహన్‌ (ప్రియమణి) ఓ గృహిణి. యూట్యూబ్‌లో వంటల ఛానెల్‌ నిర్వహిస్తుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త వంటకాలను చేయడంతో పాటు, పక్కింట్లో ఏం జరుగుతుందోనన్న విషయాలను సైతం ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. మరోవైపు కోల్‌కతా మ్యూజియంలో రూ.200 కోట్ల విలువైన గుడ్డు ఒకటి మాయమవుతుంది. ఆ గుడ్డు వల్ల అనుపమ, ఆమె కుటుంబం ఎలా ఇబ్బందుల్లో పడింది? చివరకు ఆ ఆపద నుంచి ఎలా బయటపడింది? అన్నది ‘భామా కలాపం’ కథ. ఇప్పుడు సీక్వెల్ ని ఇంచుమించు అదే కథతో రూపొందించాడు డైరెక్టర్ అభిమన్యు.

మొదటి భాగంలో ఆపద నుంచి బయటపడ్డ అనుపమ.. ఇల్లు మారడంతో పార్ట్‌-2 ప్రారంభమవుతుంది. ఇతరుల విషయాలను పట్టించుకోనని భర్తకు మాటిచ్చిన అనుపమ యూట్యూబ్‌ ద్వారా వచ్చిన ఆదాయంతో హోటల్‌ ప్రారంభించడం ‘హ్యాపీ లైఫ్’ లీడ్ చేయడం జరుగుతుంది. అయితే.. అంతలోనే కొన్ని అనివార్య పరిణామాలతో మళ్లీ 1000 కోట్లు విలువ చేసే కోడిపుంజు బొమ్మను దొంగిలించే క్రమంలో అనుపమ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది అన్నది ‘భామా కలాపం 2’ కథ.

మొదటి భాగం అంతా ఒకే అపార్ట్ మెంట్ లో జరిగే మర్డర్ మిస్టరీ కాగా.. రెండో భాగం స్కేల్ భారీగా పెంచారు. ఈ భాగంలో ప్రియమణి, పని మనిషి పాత్రలో శరణ్య ప్రదీప్ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అయ్యింది. వీళ్లిద్దరూ కలిసి కనిపించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ సీక్వెల్ లో సీరత్ కపూర్ ది కీలక పాత్ర. ఆమె అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆంటోనీ లోబో, తాషీర్‌, సదానందం తమ పాత్రల పరిధి మేరకు నటించారు. బ్రహ్మాజీ అతిథి పాత్రలో సందడి చేశాడు.

ప్రశాంత్‌ ఆర్‌.విహారి నేపథ్య సంగీతం, దీపక్‌ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. మొత్తంగా ప్రియమణి నటన, కథలోని ట్విస్ట్ లు, టెక్నికల్ టీమ్ పనితీరు బాగుంది. అక్కడక్కడా కాస్త ల్యాగ్ అవ్వడం.. ప్రీ క్లైమాక్స్ ఇంకా బాగా తీర్చిదిద్దుంటే బాగుండేది.

రేటింగ్ : 2.75/5

Related Posts