‘టిల్లు స్క్వేర్’ రివ్యూ

నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, ప్రిన్స్‌, మురళీధర్ గౌడ్, మురళీ శర్మ తదితరులు
సినిమాటోగ్రఫి: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
సంగీతం: రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్)
ఎడిటింగ్‌:
నవీన్ నూలీ
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: మల్లిక్ రామ్
విడుదల తేది: మార్చి 29, 2024

పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘డీజే టిల్లు’ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో టిల్లుగా ఆన్ స్క్రీన్ పై అమాయకత్వంతో కూడిన క్యారెక్టరైజేషన్.. స్టైల్, రొమాన్స్.. అన్నింటిలోనూ తనకు తానే సాటి అనిపించుకున్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు ‘డీజే టిల్లు’కి సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘టిల్లు స్క్వేర్’. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న ‘టిల్లు స్క్వేర్’ ఎలా ఉంది? ఆడియన్స్ అంచనాలను అందుకుందా? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

కథ
మొదటి భాగం (డీజే టిల్లు)కి కొనసాగింపుగానే సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ రూపొందింది. మొదటి భాగంలో రాధిక (నేహా శెట్టి) చేసిన మోసం నుంచి కోలుకున్న బాల గంగాధర్ తిలక్ అలియాస్ డీజే టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) ‘టిల్లు ఈవెంట్స్’ స్టార్ట్ చేస్తాడు. వెడ్డింగ్ ఈవెంట్స్, డీజే ఈవెంట్స్ తో బిజినెస్ బాగానే సాగుతుంది. ఆ సమయంలో అతని జీవితంలోకి లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) ప్రవేశిస్తుంది. తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకుంటాడు. మత్తులో ఒక రాత్రి కలిసి గడుపుతారు. ఆ తర్వాత సడెన్ గా మాయమైన లిల్లీ.. నెల తర్వాత తాను గర్భవతి అని చెబుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో లిల్లీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు టిల్లు. ఈకోవలో అతను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు రాధిక (నేహా శెట్టి) కథకి లిల్లీకి సంబందం ఏంటి? వంటివి తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
చిన్న సినిమాగా విడుదలై సెన్సేషన్ సృష్టించిన ‘డీజే టిల్లు’ ఎంటర్ టైన్ మెంట్ పరంగా ఓ కల్ట్ హిట్ గా నిలిచింది. ‘డీజే టిల్లు’ మేనియాని ‘టిల్లు స్క్వేర్’లోనూ కొనసాగించడంలో మేకర్స్ సంపూర్ణంగా సఫలీకృతులయ్యారని చెప్పొచ్చు.

సినిమా టైటిల్ కార్డ్స్ నుంచి ఎండింగ్ వరకూ టిల్లు క్యారెక్టర్ తో ట్రావెల్ అవుతారు ఆడియన్స్. ఫస్ట్ హాఫ్ కామెడీ తో నవ్విస్తే, సెకండ్ హాఫ్ రాధిక క్యారెక్టర్ తో మరింత నవ్వించి, మెప్పించాడు సిద్ధు జొన్నలగడ్డ.

ఫుల్ లెన్త్ ఎంటర్ టైన్ మెంట్ అందించడంలో ఫుల్ మార్కులతో పాస్ అవుతుంది ‘టిల్లు స్క్వేర్’. అయితే.. కథలో కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకి ఒక మైనస్. కొన్ని సీన్స్ ఊహాజనీతం గానే అనిపిస్తాయి. కొన్ని ట్విస్ట్ లు కూడా అంత ఎగ్జైట్ చెయ్యవు. క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా రొటీన్ గానే అనిపిస్తుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. స్టార్ బాయ్ సిద్ధూ మరోసారి డీజే టిల్లుగా ఆన్ స్క్రీన్ పై అదరగొట్టాడు. తన మార్క్ కామెడీ టైమింగ్ తో.. హిలేరియస్ ఒన్ లైనర్స్ తో ఆడియన్స్ కు గిలిగింతలు పెట్టాడు. మేకోవర్ పరంగానూ సిద్ధు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు.

ఫస్ట్ పార్ట్ లో కనిపించిన నేహా శెట్టి (రాధిక) సీక్వెల్ లోనూ కాసేపు మురిపిస్తుంది. ఇక.. రాధిక పాత్రకు మించిన రీతిలో డబుల్ డోస్ రొమాన్స్ తో లిల్లీ పాత్రలో చెలరేగిపోయింది అనుపమ పరమేశ్వరన్. గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ లోనూ అదరగొట్టింది అనుపమ. ఇతర కీలక పాత్రల్లో మురళీ ధర్ గౌడ్, మురళీ శర్మ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఈ సినిమా రచనలో హీరో సిద్ధు జొన్నలగడ్డ పార్టిసిపేషన్ కూడా ఉంది. దర్శకుడు మల్లిక్ రామ్ ప్రతిభ ప్రతీ ఫ్రేములో కనిపిస్తుంది. ‘టిల్లు స్క్వేర్’కి టెక్నికల్ ఫ్రంట్ లో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ప్లస్ పాయింట్స్. రామ్ మిరియాల కంపోజ్‌ చేసిన ‘డీజే టిల్లు…’ రీమిక్స్, ‘రాధికా రాధికా’ పాటలతో పాటు అచ్చు రాజమణి అందించిన ‘ఓ మై లిల్లీ’ సాంగ్‌ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. ముఖ్యంగా భీమ్స్ నేపథ్య సంగీతం అదిరిపోయింది. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

చివరగా
‘టిల్లు స్క్వేర్’.. రోలర్ కోస్టర్ ఫన్ రైడ్ అని చెప్పొచ్చు. ఈ వీకెండ్ లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసే మూవీ.

Related Posts