మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బయోగ్రఫీ

షార్ట్ పీరియడ్ లోనే తెలుగులో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఈరోజు (మార్చి 29) విశ్వక్ సేన్ పుట్టినరోజు. విశ్వక్ సేన్ 1995వ సంవత్సరంలో మార్చి 29న హైదరాబాద్ లో పుట్టాడు. విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ నాయుడు. సినిమాల్లోకి ప్రవేశించే ముందే న్యూమరాలజీ ప్రకారం తన పేరును విశ్వక్ సేన్ గా మార్చుకున్నాడు.

2017లో ‘వెళ్లిపోమాకే’ సినిమాతో హీరోగా పరిచయమైన విశ్వక్ కి.. ఆ తర్వాతి ఏడాది వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో రూపొందిన ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీలో వివేక్ పాత్రలో తనదైన పెర్ఫామెన్స్ తో అదరగొట్టేశాడు.

విజయానికి షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవు. టాలెంట్ పుష్కలంగా ఉంటేనే ఇక్కడ రాణించగలుగుతారు. ఇక కొన్ని సందర్భాల్లో రిస్క్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో విశ్వక్ సేన్ ని మెచ్చుకోవాలి. కేవలం రెండు సినిమాల అనుభవంతోనే తానే దర్శకుడిగా, హీరోగా ‘ఫలక్ నుమ దాస్’ సినిమాని మొదలుపెట్టాడు. మలయాళీ సినిమా ‘అంగమలీ డైరీస్’కి రీమేక్ గా ‘ఫలక్ నుమ దాస్’ రూపొందింది. ఒరిజినల్ లోని సోల్ మాత్రమే తీసుకుని.. తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో నటుడిగా, దర్శకుడిగా ‘ఫలక్ నుమ దాస్’ మూవీతో మాస్ కా దాస్ అనిపించుకున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

ఒక సినిమాకి మరొక చిత్రానికి ఎలాంటి సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన పాత్రలతో దూసుకెళ్తుంటాడు విశ్వక్. ఈకోవలోనే ‘ఫలక్ నుమ దాస్’ తర్వాత ‘హిట్’ మూవీ చేశాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నిర్మించిన ‘హిట్’ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని ఆ తర్వాత హిందీలోకి తీసుకెళ్లడం.. ఇక్కడ సీక్వెల్ కూడా తీసుకురావడం జరిగింది. ‘హిట్’ మూవీలో విక్రమ్ రుద్రరాజు అనే పోలీస్ పాత్రలో ఎన్నో వేరియేషన్స్ చూపించాడు విశ్వక్.

‘హిట్.. ది ఫస్ట్ కేస్’ తర్వాత మళ్లీ రొమాంటిక్ మోడ్ లోకి మారాడు. ‘పాగల్’ పేరుతో ఫక్తు రొమాంటిక్ లవ్ స్టోరీ చేశాడు. నరేష్ కుప్పిలి డైరెక్షన్ లో రూపొందిన ‘పాగల్’ ఫర్వాలేదనిపించింది. ఇక.. కరోనా బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలిచింది. అంతకుముందు సినిమాల్లో మంచి ఎనర్జీతో యూత్ ఫుల్ గా రెచ్చిపోయిన విశ్వక్ సేన్.. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’లో మాత్రం మిడిల్ ఏజ్డ్ గయ్ గా కాస్త ఫ్యాట్ లుక్ లో నటించి అదరగొట్టాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం అంటే ఏంటో ఈ సినిమాతో నిరూపించాడు విశ్వక్.

‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ తర్వాత ‘ఓరి దేవుడా, ముఖచిత్రం’ చిత్రాలు ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. తమిళంలో హిట్టైన ‘ఓ మై కడవులే’ రీమేక్ గా ‘ఓరి దేవుడా’ రూపొందింది. ఒరిజినల్ ను తెరకెక్కించిన అశ్విన్ మరిముత్తు డైరెక్షన్ లోనూ రీమేక్ ‘ఓరి దేవుడా’ కూడా తెరకెక్కింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. ఇక.. ‘ఫలక్ నుమ దాస్’ తర్వాత మరోసారి తన డైరెక్షన్ లో ‘దాస్ కా ధమ్కీ’ సినిమా చేశాడు. ఈ మూవీలో రెండు పాత్రల్లో ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా ఇచ్చాడు విశ్వక్. మరోసారి విశ్వక్ డైరెక్షన్ కి మంచి మార్కులు పడ్డాయి.

ఇక.. ఇటీవల ‘గామి’ సినిమాతో మంచి విజయాన్నందుకున్న విశ్వక్ సేన్.. ప్రస్తుతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వీటిలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఒకటి. ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జోడీగా నేహా శెట్టి నటిస్తుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈరోజు విశ్వక్ సేన్ బర్త్ డే స్పెషల్ గా విశ్వక్ కొత్త చిత్రానికి ‘మెకానిక్ రాకీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి దర్శకుడు.

చాలా చిన్న వయసులోనే హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తున్న విశ్వక్ సేన్.. కాంట్రవర్శీల విషయంలో ముందుంటాడు. అప్పట్లో విజయ్ దేవరకొండపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే విమర్శలు వచ్చాయి. అలాగే.. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా విశ్వక్ సేన్ తో సినిమా విషయం పెద్ద కాంట్రవర్శీయే అయ్యింది. అయితే.. అర్జున్ సినిమా కాంట్రవర్శీలో తన తప్పేమీ లేదని.. ఆయన కావాలని పెద్ద రచ్చ చేశారని విశ్వక్ సేన్ అన్నాడు. ఏదేఏమైనా.. మునుముందు మన మాస్ కా దాస్ మరిన్ని మంచి చిత్రాలతో అలరించాలని ఆశిస్తూ.. విశ్వక్ సేన్ కి బర్త్ డే విషెస్ తెలుపుతుంది తెలుగు 70 ఎమ్.ఎమ్.

Related Posts