విజయాధినేత బి.నాగిరెడ్డి జయంతి

తెలుగువారి మదిలో విజయా సంస్థకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. విజయా సంస్థ అనగానే ‘పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్, జగదేకవీరుని కథ, గుండమ్మకథ’ వంటి అద్భుతమైన చలనచిత్ర కళాఖండాలు గుర్తుకొస్తాయి. విజయా సంస్థ సారథుల్లో ఒకరైన బి.నాగిరెడ్డి జయంతి నేడు (డిసెంబర్ 2).

తెలుగువారికి తమ సినిమాలతో పున్నమి చంద్రుని వెన్నెల చల్లదనం అందించిన ఘనులు నాగిరెడ్డి- చక్రపాణి. వీరు.. ఇద్దరు వ్యక్తులైనా ఏకప్రాణంగా సాగారు. వీరి సినిమాలు కూడా తెలుగువారితో విడదీయరాని బంధం పెనవేసుకున్నాయి. తొలి చిత్రం ‘షావుకారు’ మొదలు చివరి చిత్రం ‘శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీక్లబ్’ దాకా విలువలకు పెద్ద పీట వేస్తూ సాగారు నాగిరెడ్డి- చక్రపాణి. చక్కన్నది ఆలోచనయితే.. నాగిరెడ్డిది ఆచరణగా ఉండేది. అందుకే విజయావారి చిత్రాల్లో వీరిద్దరి అభిరుచి తొణికిసలాడేది.

తన అన్న దిగ్దర్శకుడు బి.ఎన్.రెడ్డి సినిమాలకు ప్రచారసారథిగా పనిచేసిన నాగిరెడ్డి.. ఆ అనుభవాన్ని విజయా సంస్థలో చక్కగా ఉపయోగించుకున్నారు. తెలుగు సినిమా స్వర్ణయుగంలో అపురూపం అనదగ్గ చిత్రాలను అందించిన సంస్థగా ‘విజయా’ను నిలిపారు నాగిరెడ్డి. సినిమాలతో పాటు పత్రికా రంగంలోనూ నాగిరెడ్డి తనదైన ముద్ర వేశారు. యువ, చందమామ, విజయచిత్ర, వనిత మాస పత్రికలు ఆయన ప్రారంభించినవే.

14 ఫ్లోర్లతో విజయా వాహినీ స్టూడియో నిర్వహణ, విజయాగార్టెన్స్ , విజయాశేష్ మహల్ , విజయా హాస్పటల్స్ నిర్మాణం ఇలా నాగిరెడ్డి జీవితమే ఓ పెద్ద ఇన్సిపిరేషన్. వ్యక్తిగా ప్రారంభమై సామ్రాజ్యంగా విస్తరించిన కృషి ఆయనది. టిటిడి ఛైర్మెన్ గా ఆయన ఏర్పాటు చేసిన సౌకర్యాలను భక్తులు ఇప్పటికీ చెప్పుకుంటారు.. అందుకే తెలుగు సినిమా బతికున్నంత వరకు గుర్తుండిపోయే పేరు నాగిరెడ్డి. 1986లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న నాగిరెడ్డి దక్షిణాది భాషల్లోనే కాకుండా ఉత్తరాదిన సైతం విజయావారి విజయబావుటా రెపరెపలాడేలా చేశారు. నాగిరెడ్డి నిర్మించిన ‘మాయాబజార్’ ఈ తరం వారినీ ఆకట్టుకోవడమే కాదు, ఆ మధ్య ఓ సర్వేలో భారతదేశంలోనే మేటి చిత్రంగా నిలిచింది.

Related Posts