ట్రైలర్ టాక్.. స్నేహం కోసం నిలబడే ‘సలార్’

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది. 3 నిమిషాల 47 సెకన్ల భారీ నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. స్నేహితుడి కోసం ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండే దేవా అనే పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. ‘నీ కోసం ఎర అయినా అవుతా.. సొర అయినా అవుతా.. నీ ఒక్కడి కోసం.. నువ్వెప్పుడు పిలిచినా నేను ఇక్కడకి వస్తా..’ అంటూ చిన్నప్పుడే తన స్నేహితుడికి అభయమిస్తాడు దేవా.

ఆ తర్వాత కథ వెయ్యేళ్లు వెనక్కి వెళుతోంది. మహమ్మద్ గజనీ, చెంఘీజ్ ఖాన్ ల కంటే క్రూరమైన బందిపోటు ఉండేవాడని.. అతను ఖాన్సార్ అనే ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని చూపించారు. ప్రస్తుతం ఆ సామ్రాజ్యాధినేత రాజ మన్నార్. అతని కొడుకే దేవా స్నేహితుడైన వరదరాజ మన్నార్. ఈలోపులో ఖాన్సార్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి కుర్చీ కోసం కుతంత్రాలు జరుగుతాయి. చివరకు వరదరాజ మన్నార్ ను చంపడానికి ప్రయత్నాలు చేస్తారు. అప్పుడు అభయమిచ్చినట్టే రంగంలోకి దిగుతాడు దేవా. మరి.. తన స్నేహితుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా? లేదా? అనేదే ఈ సినిమా కథగా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

ఈ సినిమాలో ప్రభాస్ డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంది. ‘పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి.. బయటకు ఎవడు పోతాడని కాదు.. లోపలికి ఎవడొస్తాడని’.. చివరిలో ‘ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్..’ అంటూ చెప్పిన ఇంగ్లీష్ డైలాగ్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. స్నేహితులుగా ప్రభాస్, పృథ్వీరాజ్.. రాజమన్నార్ పాత్రలో జగపతిబాబు, ఇంకా.. బాబీ సింహా వంటి క్యారెక్టర్స్ ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. శ్రుతి హాసన్ ఒక ప్రేములో మెరిసిందంతే. అయితే.. ఈశ్వరి రావు, గరుడ రామ్ పాత్రలను చూస్తే ఈ సినిమా ‘కె.జి.యఫ్’లో భాగమేనని అర్థమవుతోంది.

Related Posts