అపజయమెరుగని అనిల్ రావిపూడి

అపజయమెరుగని దర్శకుడు అనే పదాన్ని మనం అరుదుగా వింటుంటాం. తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకరత్న దాసరి నారాయణరావుకి ఈ పదాన్ని ఆయన తొలి రోజుల్లో ఉపయోగించేవారు. ఎందుకంటే దాసరి తన తొలి సినిమా ‘తాత మనవడు’తోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా పది సినిమాలు హిట్టయ్యాయి.దీంతో అప్పట్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఆయనో ట్రెండ్ సెట్ చేశారు. అయితే.. ఆ తర్వాత దర్శకుడిగా వంద సినిమాల మైలురాయిని దాటి రికార్డు సృష్టించిన దాసరి కెరీర్ లో చాలా ఫ్లాప్స్ కూడా ఉన్నాయి.

ఈతరంలో అసలుసిసలు అపజయమెరుగని దర్శకుడు అంటే దర్శకధీరుడు రాజమౌళి పేరు చెప్పాలి. తొలి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’ వరకూ అసలు అపజయమే లేని డైరెక్టర్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు జక్కన్న. దర్శకధీరుడు తర్వాత కొరటాల శివ కు కూడా ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ.. ‘ఆచార్య’ ఫ్లాప్ తో ఈ లిస్టు నుంచి బయటకు వెళ్లిపోయిపోయాడు కొరటాల.

రాజమౌళి తర్వాత అపజయమెరుగని దర్శకుల లిస్టులో అనిల్ రావిపూడి మాత్రమే ఉన్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ ‘పటాస్’ మొదలుకొని.. నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ వరకూ అనిల్ చేసిన 7 సినిమాలూ విజయాలు సాధించాయి. అయితే అనిల్ రావిపూడి గత చిత్రాల్లో అదిరిపోయే యాక్షన్ తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ హైలైట్ గా నిలిచింది. కానీ.. ‘భగవంత్ కేసరి’ విషయంలో తన శైలికి పూర్తి భిన్నంగా వెళ్లాడు. ఈ సినిమాలోని మహిళా సాధికారతను హైలైట్ చేస్తూ అనిల్ చేసిన ప్రయోగం పూర్తిస్థాయిలో ఫలించింది. దసరా బరిలో ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ గా దూసుకెళ్తుంది.

మరోవైపు అనిల్ రావిపూడి తన గత నాలుగు చిత్రాలతో అరుదైన రికార్డును అందుకున్నాడు. ‘ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3, భగవంత్ కేసరి’ సినిమాలతో వరుసగా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలను అందించాడు. మరోవైపు ఈ సినిమాలన్నీ ఓవర్సీస్ లో 1 మిలియన్ క్లబ్ లో కూడా చేరాయి.

Related Posts