బాలీవుడ్ బాట పడుతోన్న టాలీవుడ్ డైరెక్టర్స్

భారతీయ చిత్ర పరిశ్రమ అంటే ముందుగా గుర్తొచ్చేది బాలీవుడ్. హిందీ చిత్ర సీమలో సినిమా చేస్తే దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందనేది ప్రాంతీయ భాషా చిత్రాల నటులు, సాంకేతిక నిపుణుల ఆలోచన. అందుకే.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ అంతా పాన్ ఇండియా రేసులో పరుగెడుతున్నారు. అయితే.. మన దర్శకులు కూడా తక్కువేం కాదు. కొంతమంది డైరెక్టర్స్ డైరెక్ట్ హిందీ చిత్రాలతో నార్త్ ఆడియన్స్ ను మెప్పించే పనిలో ఉన్నారు.

గతంలో రామ్ గోపాల్ వర్మ వంటి తెలుగు దర్శకులు బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేశారు. ఇంకా.. ముందుకు వెళితే దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కె.విశ్వనాథ్, బాపు. కె.బాపయ్య, కె.మురళీమోహనరావు వంటి తెలుగు దర్శకులు బాలీవుడ్ లోనూ పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ ఈమధ్య బాలీవుడ్ లో స్ట్రెయిట్ మూవీస్ చేసే టాలీవుడ్ డైరెక్టర్స్ పెరుగుతున్నారు.

తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తో భారీ విజయాన్నందుకున్న సందీప్ రెడ్డి వంగా.. అదే సినిమాని హిందీలో ‘కబీర్ సింగ్’గా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ‘కబీర్ సింగ్’ ఇచ్చిన ఉత్సాహంతో.. సందీప్ బాలీవుడ్ లోనే సెటిలైపోయాడు. ఆ తర్వాత రణ్ బీర్ కపూర్ తో ‘యానిమల్’ తీసి బీటౌన్ లో ఒన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్స్ గా ప్రూవ్ చేసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా తరహాలోనే.. తమ తెలుగు చిత్రాలతో బాలీవుడ్ కి వెళ్లారు ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను, ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి. అయితే.. ఈ రీమేక్స్ బాలీవుడ్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి.

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ముగ్గురు దర్శకులు బాలీవుడ్ బడా స్టార్స్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది మలినేని గోపీచంద్. ఇప్పటివరకూ తెలుగులో అగ్ర కథానాయకులతో సినిమాలు చేసిన మలినేని.. ఆమధ్య రవితేజాతో ఒక సినిమాని ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కానీ.. బడ్జెట్ కారణాల రీత్యా ఆ ప్రాజెక్ట్ ను ఆపేశారు. ఇప్పుడు మలినేని గోపీచంద్.. బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ తో సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలోనే ఈ చిత్రం తెరకెక్కనుంది.

‘హనుమాన్’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం ‘జై హనుమాన్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. లేటెస్ట్ గా ఫిల్మ్ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతోన్న సమాచారం ప్రకారం ‘జై హనుమాన్’ కంటే ముందే ప్రశాంత్ వర్మ.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో ఒక సినిమా చేస్తాడట. త్వరలోనే.. రణ్‌వీర్ సింగ్ – ప్రశాంత్ వర్మ కాంబో మూవీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.

తెలుగు చిత్ర పరిశ్రమలో రెండేళ్లకొక సినిమా చొప్పున చేస్తున్న వంశీ పైడిపల్లి ఈసారి బాలీవుడ్ బాట పడుతున్నాడట. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. వంశీ పైడిపల్లి ఆస్థాన నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లోనే షాహిద్ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే.. వంశీ పైడిపల్లి-షాహిద్ కపూర్ మూవీపై అధికారిక ప్రకటన రానుందట.

Related Posts