టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ వస్తోంది

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. 1970ల ప్రాంతంలో చీరాల దగ్గరలోని స్టూవర్ట్ పురం గ్రామానికి చెందిన గజదొంగ నాగేశ్వరరావు పాత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టుగా మేకర్స్ ముందే చెప్పారు. ఈ మూవీతో వంశీ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఆల్రెడీ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో రవితేజ చేసిన క్రాక్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మరోసారి అదే జిల్లాకు చెందిన వ్యక్తి కథ ఈ టైగర్ నాగేశ్వరరావు. రీసెంట్ గా వచ్చిన టీజర్, పాటలు బాగా ఆకట్టుకున్నాయి. నాగేశ్వరరావు గజ దొంగగా జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని గడగడలాడించాడు అని నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. అలాంటి పాత్రలో మాస్ మహరాజ్ అంటే మాస్ ఆడియన్స్ కు ఫీస్ట్ అని వేరే చెప్పక్కర్లేదు.


ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ఆ టైమ్ లో టైగర్ నాగేశ్వరరావు తో పాటు బాలకృష్ణ – అనిల్ రావిపూడిల భగవంత్ కేసరి, విజయ్ – లోకేష్‌ కనకరాజ్ ల లియోతో పాటు కన్నడ శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రాలు దసరా బరిలో ఉన్నాయి. ఇక టైగర్ లో రవితేజకు జోడీగా నుపుర్ సనన్ హీరోయిన్ గా నటించింది. జీవి ప్రకాష్‌ కుమార్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం నుంచి ఆల్రెడీ విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గకు వస్తోంది కాబట్టి ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్లాన్ చేసింది టీమ్.


టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ ను ఈ నెల 3న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. మరి ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతాయని మాత్రం చెప్పొచ్చు. అఫ్‌ కోర్స్ ట్రైలర్ బావుంటేనేలెండి. మొత్తంగా మాస్ రాజా ఈ యేడాది ఆల్రెడీ వాల్తేర్ వీరయ్యతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన రావణాసుర ఆకట్టుకోలేదు. మరి ఈ టైగర్ నాగేశ్వరరావుతో దసరా పండగ జోష్ ను డబుల్ చేస్తాడేమో చూడాలి.

Related Posts