ఒక్క నెలలో మూడు మెగా ఫ్లాప్స్

నెల రోజుల్లోనే ముగ్గురు మెగా హీరోలు మూడు ఫ్లాపులు చూశారు. ఫ్లాపులు అనే కంటే డిజాస్టర్స్ అని కూడా చెప్పొచ్చేమో. గత నెల 28న బ్రో సినిమా విడుదలైంది. పవన్ కళ్యాణ్, సాయితేజ్ కలిసి నటించిన ఫస్ట్ మూవీ ఇది. తమిళ్ ఓటిటి హిట్ మూవీ వినోదాయ సీతాకు రీమేక్ గా వచ్చింది. ఒరిజినల్ దర్శకుడు సముద్రఖనే తెలుగులోనూ డైరెక్ట్ చేశాడు. కాకపోతే ఇక్కడ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ను త్రివిక్రమ్ అందించాడు. అసలు రీమేక్ వద్దు అని అభిమానుల ఆందోళన పడుతున్న తరుణంలో వచ్చిన ఈమూవీ కంటెంట్ ప్రేక్షకులకే కాదు.. ఫ్యాన్స్ కు కూడా కనెక్ట్ కాలేదు. అందుకే బాక్సాఫీస్ వద్ద పోయింది.


బ్రో పోయినా మెగాస్టార్ భోళా శంకర్ ఉందనుకున్నారు. అఫ్ కోర్స్ ఇది కూడా ఫ్యాన్స్ వద్దు మొర్రో అని మొత్తుకున్న రీమేక్ నే. అయినా మెగాస్టార్ వినలేదు. పైగా డిజాస్టర్స్ అనే పదానికి పేటెంట్ రైట్స్ ఉన్న మెహర్ రమేష్ కు దశాబ్దం తర్వాత దర్శకత్వ బాధ్యతలు ఇచ్చారు. తమిళ్ లోనే రొటీన్ అనిపించుకున్న వేదాళం అనే అజిత్ సినిమాకు రీమేక్ ఇది.

ఇదే పేరుతో తెలుగులోనూ డబ్ అయింది. అయినా మెగాస్టార్ తన అనుభవాన్ని కాదని మరీ ఈ చిత్రానికి ఓటేయడమే పెద్ద మైనస్. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రంపై ఏ దశలోనూ అంచనాలు లేవు. ఆ కారణంగా ఓపెనింగ్స్ కూడా లేవు. కట్ చేస్తే మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చింది.


ఇక ఈ శుక్రవారం వచ్చిన వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సైతం అంతే అయింది. ఇది రీమేక్ కాదు. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన సినిమా. టీజర్, ట్రైలర్ తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ చూడబోతున్నాం అనే ఫీలింగ్ ఇచ్చింది. బట్ ఈ మూవీపైనా అంచనాలు లేవు. అందుకు కారణం వరుణ్ తో పాటు ప్రవీణ్ గత సినిమాలు డిజాస్టర్స్ అయి ఉండటం. బట్ ఇలాంటి సినిమాలు ఈ దర్శకుడు బాగా తీస్తాడు అనుకున్నారు.

కట్ చేస్తే గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతున్న చెత్త, బయో గార్బేజ్ అనేఅంశాలను చెప్పాలనుకున్న ప్రవీణ్ ఆ విషయాన్ని ఆడియన్స్ కు సరిగ్గా కనెక్ట్ చేయడంలోనూ తన కథను కన్వే చేయడంలోనూ విఫలమయ్యాడు. కట్ చేస్తే ఇదీ పోయింది. మొత్తంగా జూలై 28 నుంచి ఆగస్ట్ 25 వరకూ వచ్చిన మూడు మెగా సినిమాలు.. నలుగురు మెగా హీరోలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చూశారు.

Related Posts