‘తలైవార్ 170‘ టీమ్ మామూలుగా లేదుగా…

సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ సూపర్ ఫామ్ లోకి వచ్చేశాడు. ‘రోబో‘ తర్వాత అసలు సిసలు హిట్ కోసం పుష్కరకాలం ఎదురుచూసిన తమిళ తలైవా కి ‘జైలర్‘ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది. ఇక ఇదే ఊపులో ఇప్పుడు ‘లాల్ సలామ్‘ అంటూ మరో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు రజనీకాంత్. ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేస్తున్న ‘లాల్ సలామ్‘ 2024 పొంగల్ బరిలో రిలీజ్ కు రెడీ అవుతోంది.

‘లాల్ సలామ్‘లో రజనీకాంత్ కేవలం కేమియోలో మాత్రమే కనిపించబోతున్నాడు. ఇక సూపర్ స్టార్ ను మళ్లీ ఫుల్ లెన్త్ రోల్ లో చూడబోయేది ‘తలైవార్ 170‘ చిత్రంలోనే. ‘జై భీమ్‘తో దర్శకుడిగా మంచి ప్రశంసలందుకున్న టీజే జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించే ఈ సినిమాకోసం ‘జైలర్‘ ఫార్ములానే ఫాలో అవుతున్నాడు రజనీకాంత్. ‘జైలర్‘ చిత్రంలో తెలుగు నుంచి సునీల్, మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, హిందీ నుంచి జాకీ ష్రాఫ్ వంటి నటులను తీసుకున్నారు. అందుకే పాన్ ఇండియా లెవెల్ లో ‘జైలర్‘ సెన్సేషన్ సృష్టించింది.

ఇప్పుడు ‘తలైవార్ 170‘ కోసం కూడా పలు భాషల నుంచి ప్రముఖ నటులను రంగంలోకి దింపుతున్నారు. అలా బాలీవుడ్ నుంచి వెటరన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ 170వ సినిమాలో నటించబోతున్నాడు. భారతీయ చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా చెక్కుచెదరని స్టార్ డమ్ సొంతం చేసుకుంటూ సాగుతోన్న కథానాయకులను మనం వేళ్లమీద లెక్కపెట్టొచ్చు.

అలాంటి వారిలో ముందు వరుసలో నిలిచే నటులు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. వీరిద్దరూ ఎవరికి వారు సోలో హీరోస్ గా దుమ్మురేపుతోన్న సమయంలోనే కలిసి కూడా ‘అంధాకానూన్, గిరఫ్తార్, హమ్‘ వంటి చిత్రాల్లో నటించారు. సిల్వర్ స్క్రీన్ పై ఈ ఇద్దరి సూపర్ స్టార్స్ ని కలిసి చూసే అవకాశం 32 ఏళ్ల తర్వాత మరోసారి రాబోతుంది.

‘తలైవార్ 170‘ టీమ్ లో టాలీవుడ్ నుంచి హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి నటించబోతున్నాడు. ఇప్పటికే పలు తమిళ సినిమాల్లో నటించిన రానా కి సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటించడం మాత్రం స్పెషల్ అనే చెప్పాలి.

అలాగే మాలీవుడ్ యాక్టింగ్ పవర్ హౌస్ ఫహాద్ ఫాజిల్ కూడా ‘తలైవార్ 170‘ టీమ్ లో ఉన్నాడు.

ఇంకా.. టాలెంటెడ్ బ్యూటీస్ రితిక సింగ్, దుషారా విజయన్.. మలయాళీ సీనియర్ యాక్ట్రెస్ మంజు వారియర్ లు కూడా ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు.

Related Posts