‘గుంటూరు కారం‘ ఆగమనానికి సరిగ్గా వంద రోజులు

టాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీ మూవీస్ లో మహేష్ బాబు ‘గుంటూరు కారం‘ ఒకటి. గతంలో మహేష్ తో ‘అతడు, ఖలేజా‘ వంటి చిత్రాలను తెరకెక్కించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అందుకే ‘గుంటూరు కారం‘పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కానీ ఈ సినిమా అప్డేట్స్ విషయంలోనే ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

మహేష్ గత చిత్రం ‘సర్కారు వారి పాట‘ వచ్చి సంవత్సరం దాటిపోయింది. ఈనేపథ్యంలో ‘గుంటూరు కారం‘ సినిమాకోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం నత్తనడకన సాగుతూ వస్తోంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ‘గుంటూరు కారం‘ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమాకి సంబంధించి టీజర్ తప్పితే ఒక్క పాట కూడా విడుదల కాలేదు. దాంతో అసలు మహేష్ మూవీ సంక్రాంతికి వస్తోందా? లేదా? అనుమానాలు మొదలయ్యాయి.

తాజాగా ‘గుంటూరు కారం‘ విడుదల విషయంలో వస్తోన్న రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ‘స్ట్రైక్స్ ఇన్ 100 డేస్‘ అంటూ వచ్చే యేడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ‘గుంటూరు కారం‘ను విడుదల చేయబోతున్నట్టు మరోసారి గుర్తు చేశారు మేకర్స్. దాంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో మళ్లీ ఉత్సాహాన్ని నింపినట్టయ్యింది. అలాగే దసరా కానుకగా ‘గుంటూరు కారం‘ నుంచి ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉందట చిత్రబృందం.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు నటిస్తున్నారు. అటు మహేష్, ఇటు త్రివిక్రమ్ సినిమాలకు వరుసగా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న తమనే ‘గుంటూరు కారం‘కి సంగీత దర్శకుడు. ఇతర టెక్నికల్ టీమ్ విషయానికొస్తే ఈ చిత్రానికి పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రాఫర్ కాగా.. నవీన్ నూలీ ఎడిటింగ్, ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

Related Posts