సుధీర్ బాబు సినిమా రిలీజ్ డేట్

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడుగా, మహేష్ బాబు బావగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు సుధీర్ బాబు. తొలినాళ్లలో కాస్త తడబడ్డా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. పాత్రకు తగ్గట్టుగా తనను తాను మలచుకునే ప్రయత్నాలు చేస్తూ కొన్ని విజయాలు సాధించాడు. ముఖ్యంగా తెలుగులో ట్రెండ్ సెట్టర్ అయిన ప్రేమకథా చిత్రమ్ తో తిరుగులేని బ్రేక్ అందుకున్నాడు. అటుపై అడపాదడపా విజయాలున్నా.. సాలిడ్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకునే సినిమా ఇంకా పడలేదు. ప్రస్తుతం అతను ‘మామా మశ్చీంద్రా’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేయడం విశేషం. అలాగే ఈ సినిమాను నటుడు, మాటల రచయిత హర్షవర్ధన్ డైరెక్ట్ చేయడం మరో విశేషం.


ఆ మధ్య విడుదలైన మామా మశ్చీంద్రా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సుధీర్ బాబు మూడు భిన్నమైన పాత్రల్లో, భిన్నమైన ఆహార్యంతో కనిపించాడు. తెలుగులో చాలామంది హీరోలు త్రిపాత్రాభినయం చేశారు కానీ.. ఇలాంటి కటౌట్స్ తో మాత్రం ఎవరూ చేయలేదు అనే చెప్పాలి. ఓ రకంగా ఇదో ప్రయోగం అని కూడా అనొచ్చు. సుధీర్ సరసన ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. ఇతర పాత్రల్లో దర్శకుడు హర్షవర్ధన్ తో పాటు అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్ వంటి వారు నటించారు.


శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై సునిల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి ఆ రోజు డిజే టిల్లు స్క్వేర్ కూడా ఉంది. కానీ ఆ సినిమాను నవంబర్ 10న విడుదల చేస్తారు అనే టాక్ బలంగా వినిపిస్తోన్న నేపథ్యంలో ఈ మామా మశ్చీంద్రా అదే రోజు రిలీజ్ చేస్తుండటంతో ఆ వార్త నిజమే అనుకోవచ్చు. అఫ్‌కోర్స్ సుధీర్ బాబు.. డిజే టిల్లకు భయపడతాడు అని అర్థం కాదు. కొంత పోటీని అవాయిడ్ చేయడమే. మరి కొన్నాళ్లుగా మంచి విజయం కోసం చూస్తోన్న సుధీర్ బాబు ఈ మామా మశ్చీంద్రతో హిట్ కొడతాడేమో చూడాలి.

Related Posts