4కె వెర్షన్ లో ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్’

థియేటర్లలో వారం వారం కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. దసరా కానుకగా విడుదలైన చిత్రాలలో ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఇక ఈ వారం ‘మార్టిన్ లూథర్ కింగ్, లింగోచ్చా’ వంటి సినిమాలున్నాయి. ఆ తర్వాతి వారమైన నవంబర్ 3న కూడా ‘కీడా కోలా, నరకాసుర, విధి’ వంటి సినిమాలు విడుదలకు ఉన్నాయి. వీటిలో ‘కీడా కోలా’పై మంచి అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమాలకు గట్టి పోటీ ఇవ్వడానికి వచ్చేస్తోంది మెగాస్టార్ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్’.

గతంలో సూపర్ హిట్టైన సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేసే సంప్రదాయం ఈ మధ్య బాగా జోరందుకుంది. అయితే ఇప్పటివరకూ ఎక్కువగా పవన్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోల సినిమాలే రీ రిలీజయ్యాయి. ఇప్పుడు మెగాస్టార్ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. చిరంజీవి నటించిన చిత్రాల్లో ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్‘ ది ప్రత్యేక స్థానం. ‘ఇంద్ర, ఠాకూర్‘ వంటి ఇండస్ట్రీ హిట్స్ తో మంచి జోష్ మీదున్న మెగాస్టార్ కి ఆ తర్వాత వచ్చిన ‘అంజి‘ బాగా నిరాశపరిచింది. ఆ సమయంలో మళ్లీ మెగాస్టార్ ని ఫుల్ ఫామ్ లో నిలిపిన మూవీగా ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్‘ నిలిచింది. పేరుకు రీమేక్ అయినా ఫక్తు మెగాస్టార్ మాస్ మూవీగా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుందీ చిత్రం.

2004లో వచ్చిన ఈ చిత్రం అప్పటి రికార్డులను బ్రేక్ చేసింది. శంకర్ దాదాగా చిరంజీవి నటించిన తీరు, చెప్పిన ఇంగ్లీష్ సామెతలు, వేసిన స్టెప్పులు అన్నీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. మెగా అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ సినిమా ప్రేమికులు సైతం ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ ‘ సినిమాకు ముగ్దులయ్యారు.జయంత్ సి.పరాన్జీ డైరెక్షన్ తో పాటు.. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఈ మూవీకి పెద్ద అసెట్‌ గా నిలిచాయి. మెగా ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం నవంబర్ 4న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ 4కె ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో నాగబాబు, శ్రీకాంత్ సందడి చేశారు. మరి.. మరోసారి థియేటర్లలో ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్‘ దుమ్మురేపుతుందేమో చూడాలి.

Related Posts