ఇకనైనా జోరుగా సాగుతాడా

ఏ నటుడి కెరీర్ లో అయినా అప్ అండ్ డౌన్స్ కామన్. కానీ కేవలం డౌన్స్ మాత్రమే కనిపిస్తే.. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన సంఘటనల్లో ఉన్నాడు హీరో సంతోష్ శోభన్. దివంగత దర్శకుడు శోభన్ తనయుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన శోభన్ కు ముందు నుంచి టాప్ స్టార్స్ నుంచి ఓ ఎంకరేజ్ మెంట్ ఉంది. బట్ దాన్ని నిలబెట్టుకుని మళ్లీ వాళ్ల అవసరం రాకుండా చూసుకోవడంలో సంతోష్ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. పైగా నెలకో సినిమా విడుదల చేస్తున్నట్టుగా కనిపిస్తూ.. క్వాలిటీలో పూర్ గా ఉంటున్నాడు. కథల ఎంపికలో ప్రతిసారీ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాడు.


అసలు ఒక్క హిట్ తో ఇన్నాళ్లూ బండి నడిపించడమే ఆశ్చర్యం. అయినా సంతోష్‌ కు సినిమాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో సినిమా అనౌన్స్ అయింది. “జోరుగా హుషారుగా షికారు పోదమా” అనేది టైటిల్. యూ ట్యూబ్‌ లో షార్ట్ ఫిల్మ్ అనే ట్రెండ్ ను మొదలుపెట్టి.. సినిమాల కంటే గొప్ప ఫీల్ ను ఇచ్చిన ఎన్నో కథలు చెప్పిన ఎమ్.ఆర్ ప్రొడక్షన్స్ వాళ్లు సినిమా నిర్మాణంలోకి వచ్చి రూపొందిస్తోన్న సినిమా ఇది. ట్రావెలింగ్ నేపథ్యంలో ఉంటుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఈ చిత్రంలో సంతోష్ సరసన ఫల్గుణి ఖన్నా హీరోయిన్ పరిచయం అవుతోంది. స్టోరీ క్యాట్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఎస్ ఒరిజినల్స్ తో కలిసి ఎమ్.ఆర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి సుభాష్‌ చంద్ర దర్శకుడు.


ఎమ్.ఆర్ వాళ్ల కంటెంట్స్ యూ ట్యూబ్ లోనే చాలా బావున్నాయి. సినిమాలో మరింత బావుండేలా చూసుకుంటారు అనుకోవచ్చు. బట్ రిలీజ్ అయ్యేంత వరకూ ఏది ఎవరికి ఎలా కనెక్ట్ అవుతుందో చెప్పలేం. యూ ట్యూబ్ ఆడియన్స్ వేరు. సినిమా ఆడియన్స్ వేరు. అయినా అభిరుచి ఉన్న ఈ టీమ్ నిర్మిస్తోన్న ఈ జోరుగా హుషారుగా షికారు పోదమా.. టైటిల్ కు తగ్గట్టుగా జోష్‌ గా ఉంటుందనే అనుకోవచ్చు. అలాగే ఈ మూవీతో సంతోష్‌ కెరీర్ కూడా ఇక నుంచి విజయాలతో జోరుగా సాగాలని కోరుకుందాం..

Related Posts