నరకాసుర నుంచి అద్భుతమైన మెలోడీ

ఒక మంచి పాట.. హృదయాలను తాకుతుంది. ఒక మంచి సంగీతం.. నవనాడుల్నీ ఉత్తేజ పరుస్తుంది. ఈ రెండూ కలిసి ఉండే పాట.. మనసు పొరల్లోకి వెళ్లి.. మదిని నింపేసి వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి పాటలు ఈ కాలంలో అత్యంత అరుదై పోయాయి. ఆ అరుదైన క్షణాలను మళ్లీ తెచ్చేందుకే వచ్చిందా అన్నట్టుగా ఉందీ పాట. అసలు మొదటి రెండు లైన్లూ వినగానే కళ్లు అరమోడ్పులు పడిపోవడం అంటే ఎలా ఉంటుందో ఈ తరానికీ అర్థమయ్యేలా ఉంది. ఇంతకీ ఇది ఏ సినిమా నుంచీ అంటే.. నరకాసుర చిత్రం నుంచి. పలాస 1978చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు తనలోని నటుడిని చూపించిన రక్షిత్ హీరోగా నటిస్తోన్న చిత్రం.

టైటిల్ కు పూర్తి భిన్నంగా ఓ క్లాసికల్ టచ్ ఉన్న పాటతో ఒక్కసారిగా మనసును తాకేలా స్వరపరిచాడు సంగీత దర్శకుడు నాఫాల్ రాజా. ఆ స్వరానికి ప్రాణం పోశాడు గాయకుడు విజయ్ ప్రకాష్‌, చిన్మయి శ్రీ పాద.
ఎప్పుడో ఇళయరాజా, కీరవాణి తొలినాళ్ల కాలం నాటి ఇన్స్ట్రుమెంట్స్, ఒక గొప్ప సాహిత్యం, పాటలోని ప్రతి పదమూ వినిపించే కంపోజింగ్. వెరసి ఈ పాట అలా వింటూ ఉండిపోవాలనిపించేలా ఉంది. అలాగని ఓల్డ్ జెనరేషన్ సాంగ్ కాదు. ఈ జెనరేషన్ కూడా ఇష్టంగా వినేలా ఉంది. ఇక శ్రీ రామ్ తపస్వి రాసిన సాహిత్యం ఒక కొత్త జంట ఊసులు చెప్పుకుంటున్నట్టుగా ఉంది.


“నిను వదలి నేనుండగలనా.. నను వదలి నువ్వుండగలవా.. ..” అంటూ మొదలైన పాటలో “కలతలేమో తలదించుకుంటాయి.. తన ప్రేమ ప్రసరించగా.. మనసులేమో తలలెత్తుకుంటాయి తన వెలుగు ప్రభవించగా.. అలలవోలే సంకల్ప బలముంది.. సంద్రాన్ని ఎదురీదగా.. చినుకువోలే ఉరికేటి మనసుంది బతుకుల్ని పండించగా.. ఏ అశ్రుధారనైనా ఆనంద భాష్పమల్లె.. మార్చు ఆచార్యుడే కరిగించే వేళ ఆపదలే .. ” అంటూ అద్భుతమైన సాహిత్యం కనిపిస్తుంది. ఎలా చూసినా ఓ గొప్ప పాటగా ఇది మరికొన్నాళ్ల పాటు నిలిచిపోతుంది. సినిమాపైనా అంచనాలు పెంచుతుంది. ముఖ్యంగా సంగీతంపై అభిరుచి ఉన్నవారికి ఇదో పాఠంలానూ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో సింగింగ్ కాంపిటీషన్స్ లో ఓ టఫ్ సాంగ్ లా మారే అవకాశమూ ఉంది.


రక్షిత్ సరసన సంగీర్తనా విపిన్, అపర్ణ జనార్ధన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాజర్, చరణ్ రాజ్, శ్రీమాన్, గాయత్రి రవిశంకర్ ఇతర కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ఇక ఈ పాటలోని విజువల్స్ ను బట్టి చూస్తే ఇదో పీరియాడిక్ డ్రామాలా కనిపిస్తోంది. ఆ లారీని చూస్తే 80 లేదా 90ల నాటి కథాంశంతో రూపొందిన చిత్రం అనుకోవచ్చు. ఇక ఈ చిత్రంతో సెబాస్టిన్ నోవా అకోస్టా దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

Related Posts