రుద్రంగి ట్రైలర్.. బలుపుకి బతుకుకి జరిగిన పోరాటం..

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన సినిమా రుద్రంగి. జగపతిబాబు, విమలా రామాన్, ఆశిష్‌ గాంధీ, మమతా మోహన్ దాస్, గణవి లక్ష్మణ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. జూలై 7న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.

కొన్నాళ్ల క్రితం వచ్చిన టీజర్ ను ఎక్స్ టెన్షన్ గా ఈ ట్రైలర్ కనిపిస్తోంది. తెలంగాణలో ఒకప్పుడు దొరలదే రాజ్యం. అమాయకులపై దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు చేయడం వారికి నీళ్లు తాగినంత సులువు. దొరముందు తల ఎత్తడం కూడా నేరం అనేంత నియంతృత్వం చూపించేవారు. అందుకే దేశానికి స్వాతంత్రం వచ్చినా అప్పట్లో తెలంగాణకు అదే టైమ్ లో రాలేదు. ఆ కాలంలో రుద్రంగి అనే ప్రాంతంలోని ఓ దొర అరాచకాలకు ఎదురుతిరిగిన వ్యక్తుల కథగా కనిపిస్తోంది ఈ ట్రైలర్ చూస్తోంటే.


అహంకారం నిండిన క్రూరమైన దొరగా జగపతిబాబు నటించాడు. అతని భార్య పాత్రలో విమలా రామన్ కనిపిస్తోంది. ఇక దొరకు ఎదురు తిరిగిన యువకుడుగా ఆశిష్ గాంధీ.. అలాగే ఊరి కోసం ఓ గొప్ప త్యాగానికి సిద్ధమయ్యే యువతిగా గణవి నటించారు. మమతా మోహన్ దాస్ పాత్ర కాస్త ప్రత్యేకంగా కనిపిస్తోంది. అయితే ఈ ట్రైలర్ లో దౌర్జన్యం, క్రూరత్వం తప్ప అసలు కంటెంట్ కనిపించడం లేదు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఇలాంటి దొరల రాజ్యం నడిచింది. మరి ఇతను ఎందుకు ప్రత్యేకం అయ్యాడు. అనేది చెప్పలేదు.

కేవలం అతని అరాచకాలను మాత్రమే చూపించబోతున్నట్టు కనిపిస్తోంది. మరి ఇంకేదైనా స్పెషల్ ఎలిమెంట్ కథలో ఉందా అనేది తెలియదు కానీ.. ఈ ట్రైలర్ చూస్తే మాత్రం ఇది తెలంగాణ ప్రాంతంలో జరిగిన కథలా కనిపించడం లేద. ఆ యాస లేదు. ఆ మట్టి వాసనా లేదు. ఈ తరహా కథ ఎక్కడ జరిగింది అని చెప్పినా చెల్లిపోయేలా ఉంది తప్ప.. ఓ బలమైన నేపథ్యం ఉన్న కథ అయితే కాదు అని చెప్పొచ్చు. నేటికీ తెలంగాణ యాసలో సహజత్వం కనిపిస్తుంది. ఇక అప్పట్లో అంటే ఎలా ఉండాలి. కేవలం అరువు తెచ్చుకున్న యాసలానే ఉంది కానీ ఆ నేచురాలిటీ పూర్తిగా మిస్ అయింది.


తెలంగాణ మట్టి కథలను తెరకెక్కిస్తున్నప్పుడు ప్రాపర్ రీసెర్చ్ అవసరం. రుద్రంగి అనే ప్రాంతం అన్నప్పుడు ఆ ప్రాంతాన్ని రిప్రెజెంట్ చేసే కథ చరిత్రలో ఉన్నట్టుగా కనిపించాలి. ఇది జరిగిన కథే అనిపించాలి. ఆ వాస్తవ కోణం కథలో మిస్ అయిందని ట్రైలర్ లోనే తేలిపోయింది. ఓ సాధారణ మాస్ మసాలా యాక్షన్ సినిమాలా కనిపిస్తోంది తప్ప.. దీనికి తెలంగాణ దొరల నేపథ్యం కనిపించడం లేదు. మరి నిర్మాత రసమయి బాలకిషన్ కు ఆ ప్రాంతం తెలుసు. దొరల ఆగడాలపై ఆడిపాడిన అనుభవమూ ఉంది. అయినా ఎందుకో దొర అనే మాటను పూర్తిగా లైట్ గా మార్చాడు. మరి సినిమాగా ఎలా ఉంటుందో కానీ.. ట్రైలర్ మాత్రం రొటీన్ కమర్షియల్ సినిమానే తలపిస్తోంది.

Related Posts