సూర్య సినిమాల లైనప్ క్రేజీగా మారుతోంది

విలక్షణ నటుడు సూర్య.. కొన్ని నెలలుగా ‘కంగువ’ ప్రాజెక్ట్ పైనే ఉన్నాడు. ఇప్పటికే సూర్య ఎన్నో తరహా పాత్రలు పోషించాడు. అయితే.. వాటన్నింటికంటే మించిన రీతిలో ‘కంగువ’లో కనిపించబోతున్నాడు. భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

పది భాషల్లో విడుదలకు ముస్తాబవుతోన్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అసలు ఏప్రిల్ లోనే ఆడియన్స్ ముందుకు రావాల్సిన ‘కంగువ’.. ఈ ఏడాది ద్వితియార్థంలో థియేటర్లలోకి రానుంది.

‘కంగువ’ సినిమా తర్వాత సూర్య లైనప్ క్రేజీగా మారుతోంది. మొదటగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. సూర్య 44వ చిత్రంగా తెరకెక్కే ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటించబోతుంది. చాలా గ్యాప్ తర్వాత సూర్య-త్రిష నటిస్తున్న సినిమా ఇదే కానుంది. ఇంకా.. ఈ మూవీలో మలయాళీ స్టార్ జోజు జార్జ్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది.

కార్తీక్ సుబ్బరాజ్ సినిమా తర్వాత సుధా కొంగర డైరెక్షన్ లో మరో మూవీ చేయనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సూరరై పొట్రు’తో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. ఇక.. సూర్య లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ‘వాడి వసల్’ కూడా త్వరలోనే పట్టాలెక్కనుందట. తమిళ విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ‘వాడి వసల్’ మూవీ ఆద్యంతం జల్లికట్టు బ్యాక్‌డ్రాప్ తో ఉండబోతుంది.

Related Posts