నాగార్జున 100వ సినిమాకి సన్నాహాలు

తమ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీస్ ను మన కథానాయకులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. ఇక వంద సినిమాల మైలురాయి అనేది ప్రతీ హీరో కల. టాలీవుడ్ సీనియర్స్ లో ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ ఆ మైల్ స్టోన్ ని అధిగమించారు. ఇప్పుడు నాగార్జున వంతొచ్చింది.

ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న ‘నా సామి రంగ‘ అతని 99వ సినిమా. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తన 100వ చిత్రానికి సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టాడట కింగ్. ఇప్పటికే నాగార్జున సెంచరీ మూవీకోసం తమిళ దర్శకుడు మోహన్ రాజా పేరు బాగా వినిపించింది. చిరంజీవితో ‘గాడ్ ఫాదర్‘ పూర్తిచేసిన తర్వాత మోహన్ రాజా.. నాగార్జున 100వ సినిమాని తెరకెక్కిస్తాడనే ప్రచారం జరిగింది. కానీ.. నాగార్జున-మోహన్ రాజా కాంబోపై మళ్లీ ఎలాంటి సమాచారం లేదు.

తాజాగా నాగార్జున వందో చిత్రంకోసం మరో తమిళ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. తమిళంలో విజయ్ ఆంటోని, అరుణ్ విజయ్ కాంబోలో ‘అగ్ని సిరగుగల్’ సినిమా తీసిన నవీన్ ఇటీవల నాగార్జునకు ఒక కథ వినిపించాడట. విభిన్నమైన పాయింట్ తో సాగే ఆ స్టోరీ బాగా నచ్చడంతో నాగ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. నాగార్జున వందో చిత్రంగా నవీన్ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు.. నాగార్జున ‘నా సామి రంగ‘ షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి ప్రసన్న కుమార్ బెజవాడ రచయితగా వ్యవహరిస్తున్నాడు. ఇక గతంలో నాగార్జునకు పలు మ్యూజికల్ ఆల్బమ్స్ అందించిన ఆస్కార్ విజేత కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తుండడం విశేషం. వచ్చే యేడాది సంక్రాంతి బరిలో ‘నా సామి రంగ‘ రాబోతుంది.

Related Posts