డబ్బింగ్ సినిమాల్లో సంచలనం ‘ప్రేమసాగరం’

అనువాద సినిమాల్లోనే ఓ సంచలనం ‘ప్రేమసాగరం’. 80లలో యువతను ఉర్రూతలూగించిన కల్ట్ మూవీ ఇది. తమిళంలో రాజేందర్ తీసిన ‘ఉయిరుళ్లవరై ఉష’ సినిమా మార్చి 4, 1983న విడుదలై అక్కడ ఘన విజయాన్ని సాధించింది. అదే చిత్రాన్ని తెలుగులో నవంబర్ 25, 1983న ‘ప్రేమసాగరం’ పేరుతో విడుదల చేశారు. రచన, దర్శకత్వంతో పాటు సంగీతం, నటన అన్నింటా తానై ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు టి.రాజేందర్. ఈ సినిమాతో నళిని ని హీరోయిన్ గా పరిచయం చేశాడు. గంగ, సరిత ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. గంగ, నళిని ప్రేమకథ ప్రధానంగా సాగే ఈ సినిమాలో టి.రాజేందర్ కీలక పాత్రలో నటించాడు. సరిత హీరోయిన్ సిస్టర్ రోల్ లో కనిపించింది.

కాలేజ్ లవ్ స్టోరీస్, కలర్ ఫుల్ క్యాంపస్ లతో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందింది. ‘ప్రేమసాగరం’ సినిమా పోస్టర్ల దగ్గర నుంచి పాటల వరకూ అన్నీ ఆ తరాన్ని ఓ ఊపు ఊపాయి. ఈ సినిమాలోని ‘అందాలొలికే సుందరి రాతిరి కలలోకొచ్చేను’, ‘చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి’, ‘బంతాడే బంగారు బొమ్మల్లారా’ పాటలు సూపర్ హిట్. ఇక..
అప్పటివరకూ కాలేజీ ప్రేమకథల్లో ఇలాంటి సినిమాని చూడని తెలుగు ప్రేక్షకులు ‘ప్రేమసాగరం’కు పోటెత్తారు. దీంతో ఈ సినిమా ఒరిజినల్ కి మించిన రీతిలో ఘన విజయాన్ని సాధించింది. ‘ప్రేమసాగరం’ డబ్బింగ్ మూవీస్ లో ఓ సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చిన పుష్కర కాలానికి తమిళం నుంచి తెలుగులోకి వచ్చిన మరో కాలేజ్ లవ్ స్టోరీ ‘ప్రేమదేశం’ మళ్లీ అలాంటి విజయాన్ని సాధించిందని చెప్పొచ్చు.

Related Posts