పూనమ్ కౌర్ పొలిటికల్ రిక్వెస్ట్

తెలుగులో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్. హీరోయిన్ గా టాప్ స్టార్ కాలేకపోయింది. కానీ కొన్నాళ్లుగా నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంటోంది. అప్పుడప్పుడూ పొలిటికల్ పంచ్ లు వేయడం.. కొందరు నాయకులను ఉద్దేశిస్తున్నట్టుగా ట్వీట్లు చేయడం చూస్తున్నాం. అవన్నీ ఎవరికి వారుగా తమకు కావాల్సినట్టుగా, అనుకూలంగా మలచుకుంటూ ఉంటారు. ఈ మలుపులే ఇంక ఆపండి అని చెబుతూ తాజాగా తను ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. మరి ఈ ప్రకటనలో ఏముందంటే..

“అందరికీ నమస్కారం..

ఇప్పటి వరకూ నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను. సమస్య ఆధారంగానే నేను స్పందిస్తుంటాను. ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం నన్ను పావుగా వాడాలనుకుంటున్నారు. ఇది సముచితం కాదు. గత ఎన్నికలలో కూడా ఇలాంటి వికృత చేష్టలు చేశారు. మరికొందరు పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు. ఒక మహిళపై ఇలాంటి కుట్రలు తగవు. మరికొందరు నాయకులు సానుభూతి పేరుతో నాకు, నా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తున్నారు. నేను సిక్కు బిడ్డను, మాకు త్యాగాలు తెలుసు, పోరాటాలూ తెలుసు. దయచేసి మీ రాజకీయాల కోసం నన్ను లాగొద్దు.

ప్రస్తుతం నేను చేనేత కళాకారుల కోసం పనిచేస్తున్నాను. గత రెండేళ్లుగా వారి కోసం జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత గారితో కలిసి దేశవ్యాప్త పర్యటన చేస్తున్నాను. ఇప్పటికే 15, 21 రాజకీయ పార్టీలకు సంబంధించిన 100కు పైగా పార్లమెంట్ సభ్యులను కలిసి వారి మద్ధతు తీసుకున్నాము. ఈ ప్రయాణంలో అనేకమంది సామాజిక ఉద్యమకారులను కలిశాము. మహిళా ఉద్యమ నేతలతో చర్చించాడు. మహిళల హక్కుల కోసం నిరంతరం నేను గళం విప్పుతూనే ఉంటాను. చేనేత మరియు మహిళా ఉద్యమాలను జాతీయ స్థాయిలో నిర్మించే క్రమంలో ఉన్నాము. నా వైపు నుంచి ఏదైనా అప్డేట్ ఉంటే నేనే స్వయంగా తెలియజేస్తాను. దయచేసి దీనిని గమనించగలరని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను..

ధన్యవాదాలు

పూనమ్ కౌర్
సామాజిక కార్యకర్త
తేదీ : 25.09.2023 “

ఇదీ పూనమ్ కౌర్ పంపిన పత్రికా ప్రకటన.. మరి ఈ ప్రకటన ఇప్పుడెందుకు చేసిందో, చేయాల్సి వచ్చిందో కానీ.. ఇకపై తనను రాజకీయ అవసరాల పావుగా వాడొద్దు అని మరోసారి చెబుతోంది అంతే.

Related Posts