మే 31న సినిమాల రష్ మామూలుగా లేదు

ఒకవైపు ఎన్నికల వేడి, మరోవైపు ఐ.పి.ఎల్. సందడి తో ఈ వేసవిలో ఇప్పటివరకూ థియేటర్లలో పెద్దగా పెద్ద సినిమాల జోరు కనిపించలేదు. వారం వారం కొత్త సినిమాలు విడుదలవుతోన్నా.. అవి అంతగా ఆడియన్స్ ను అలరించలేకపోయాయి. ఇక.. మే నెల చివరిలో ఏకంగా అరడజను సినిమాలు విడుదలకు ముస్తాబయ్యాయి. మీడియం రేంజ్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలన్నీ వేటికవే విభిన్నంగా రాబోతున్నాయి.

ముందుగా చెప్పుకోవాల్సింది సుధీర్ బాబు ‘హరోం హర’. ఇప్పటివరకూ సుధీర్ బాబు చేయనటువంటి వైవిధ్యభరిత పాత్రతో ఈ సినిమా రాబోతుంది. ఆద్యంతం పీరియడిక్ బ్యాక్ డ్రాప్ లో ఙ్ఞానశేఖర్ ద్వారక రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి.నాయుడు నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ‘హరోం హర’ను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కి జోడీగా మాళవిక శర్మ నటిస్తుంది. మరో కీలక పాత్రలో సునీల్ కనిపించబోతున్నాడు.

కాజల్ అగర్వాల్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్న చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కడపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కాజల్ కి జోడీగా నవీన్ చంద్ర నటిస్తున్నాడు. అసలు మే 17న రావాల్సిన ‘సత్యభామ’ మే 31కి షిప్ట్ అయ్యింది.

యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న ‘భజే వాయు వేగం’ కూడా మే 31 నే థియేటర్లలోకి రాబోతుంది. యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ రెడ్డి దర్శకుడు. కార్తికేయకి జోడీగా ఐశ్వర్య మీనన్ నటిస్తుంది. ఇప్పటివరకూ రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తో ‘భజే వాయు వేగం’పై మంచి బజ్ ఏర్పడింది.

ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’ సైతం మే 31న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ మూవీలో ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో ఉదయ్ శెట్టి దర్శకుడిగా అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం.

అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రలు పోషించిన మూవీ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి రచన, దర్శకత్వం వహించారు. ఓ విభిన్నమైన పాయింట్ తో ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ రాబోతుంది. మే 31నే ఈ సినిమా కూడా రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకుంది.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. మే 31న విడుదలవుతోన్న చిత్రాలలో మంచి క్రేజున్న మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. నేటితరం యువ కథానాయకుల్లో మంచి ఫామ్ లో ఉన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ‘గామి’ హిట్ తర్వాత విశ్వక్ నుంచి వస్తోన్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అసలు మే 17న విడుదలవ్వాల్సి ఉంది.

ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది టీమ్. సరిగ్గా ఐదేళ్ల క్రితం మే 31న విశ్వక్ సేన్ నటించిన ‘ఫలక్‌నుమ దాస్’ విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ సెంటిమెంట్ తోనే మే 31కి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ని విడుదల చేయబోతున్నారు.

Related Posts