‘గాడ్’ ట్రైలర్ ఓ మై గాడ్ అనేలా ఉందే

క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. కాకపోతే చివరి వరకూ కుర్చీలో కూర్చోలేం అన్నంత సస్పెన్స్ మెయిన్టేన్ చేయాలి. నెక్ట్స్ ఏం జరుగుతుందా అని భయంతో కూడిన క్యూరియాసిటీ ఉండాలి. ఈ లక్షణాలు ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. కొన్నాళ్ల క్రితం తమిళ్ లో వచ్చిన రాచ్చసన్ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఆ మూవీ తెలుగులో రాక్షసుడుగా రీమేక్ అయితే ఇక్కడ బెల్లంకొండ శ్రీనివాస్ కు ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏదైనా క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ఇండియాలనే ది బెస్ట్ అనిపించుకున్న చిత్రాల్లో రాక్షసుడు ఒకటి. ఇప్పుడు అలాంటిదే మరో సినిమాతమిళ్ నుంచే రాబోతోంది. తమిళ్ లో ఇరైవన్ అనే పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో గాడ్ అనే టైటిల్ తో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. నిజానికి తమిళ్ ట్రైలర్ చూసిన చాలామంది ఈ చిత్రం తెలుగులోనూ వస్తే బావుంటుందనుకున్నారు. అలాంటి వారికోసమే అన్నట్టుగా తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా తెలుగు గాడ్ ట్రైలర్ విడుదలైంది.


జయం రవి హీరోగా రూపొందిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. ఈ ఇద్దరూ ఇంతకు ముందు తనీ ఒరువన్(తెలుగులో ధృవ) అనే బ్లాక్ బస్టర్ లో కలిసి నటించారు. ఈ కారణంగానే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడితే.. ట్రైలర్ తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. రాక్షసుడుకు మించిన క్రైమ్ థ్రిల్లర్ లా ఉంది. రాక్షసుడు మూవీల విలన్ ఎవరు అనేది చివరి వరకూ తెలియదు. బట్ ఈ మూవీలో ట్రైలర్ లోనే రివీల్ చేశారు. అంటే క్యాట్ అండ్ మౌస్ లా హీరో, విలన్ మధ్య ఓ రేస్ నడుస్తుందని ముందే చెప్పారు. విలన్ పాత్రలో రాహుల్ బోస్ అత్యంత క్రూరమైన పాత్ర చేస్తున్నట్టుగా ఉంది. టీనేజ్ లో ఉన్న అమ్మాయిలను కిడ్నాప్ చేసి.. అత్యంత పాశవికంగా చంపేసే విలన్ ఒకవైపు.. తన కస్టడీలో ఉన్న కరడుగట్టిన నేరగాళ్లను వదిలేసి ఆ తర్వాత వారిని ఎవరికీ తెలియకుండా చట్టానికి దొరక్కుండా చంపేసే ఓ పోలీస్ ఆఫీసర్.. ఈ ఇద్దరి మధ్య సాగే రేసీ స్టోరీయే ఈ గాడ్. ఇందులో విజయం ఎవరిదో సులువుగానే ఊహించొచ్చు. బట్ ఎలా అన్నదే స్క్రీన్ ప్లే పై ఆధారపడి ఉంటుంది.


ట్రైలర్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ప్రతి ఫ్రేమ్ భయం గొలుపుతూనే ఈ తరహా చిత్రాలను ఇష్టపడేవారికి ఫీస్ట్ లా కనిపిస్తోంది. అటు జయం రవి, నయనతార ట్రాక్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే ఎలిమెంట్స్ తో కనిపిస్తోంది. ఎల్ అహ్మద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సుధాన్ సుందరమ్, జయరామ్ జి నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం చేశాడు. ఈ మూవీ తమిళ్ లో ఈ 28న విడుదల కాబోతోంది. తెలుగులో మాత్రం త్వరలోనే విడుదల అని ట్రైలర్ లో చెప్పారు. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రిలీజ్ డేట్ కోసం ఈగర్ గా చూస్తారని మాత్రం చెప్పొచ్చు.

Related Posts