అసలీ సినిమా బయటకు వస్తుందా విష్ణూ..

ఇండస్ట్రీలో రాణించాలంటే బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే ఉంటే సరిపోదు అని మంచు బ్రదర్స్ ను చూసిన ప్రతిసారీ అనుకుంటారు. మంచు విష్ణు కెరీర్ మొదలుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తోంది. ఇన్నేళ్లలో హిట్స్ ఎన్ని అంటే ఒక చేతి వేళ్లు కూడా అక్కర్లేదు అనిపించేలా ఉన్నాయి. మంచి టైమింగ్, డ్యాన్సర్ కూడా. కానీ ఎంచుకునే కథలే ఏవీ సెట్ అవడం లేదు. వరుసగా అన్నీ డిజాస్టర్స్ పడుతున్నాయి. అయినా అతను మాత్రం తనో స్టార్ హీరో అనే భావిస్తాడు. భారతదేశం గర్వించదగ్గర నటుల్లో ఒకడుగా ఫీల్ అవుతుంటాడు. అది అతని వ్యక్తిగతం. అయితే తాజాగా ఓ ఎపిక్ మూమెంట్ కు తెరలేపాడు విష్ణు.


ఒకప్పుడు కృష్ణంరాజు రూపొందించిన భక్త కన్నప్ప చిత్రాన్ని మళ్లీ తను కూడా తీయబోతున్నట్టు ప్రకటించాడు. ఇది చారిత్రక పౌరాణిక కథ. కాబట్టి ఎవరైనా తీయొచ్చు. విష్ణు ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందిస్తానని చెప్పాడు. రీసెంట్ గా ప్రభాస్ కూడా నటిస్తున్నాడు అంటూ ఓ ఎక్స్ (ట్వీట్) చేశాడు. బట్ ప్రభాస్ నుంచి ఎలాంటి ట్వీటూ రాలేదు. తాజాగా అతనే మరో ఎక్స్ చేశాడు. తమ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకుందనేదే ఆ ఎక్స్ సారాంశం. వేరే చిత్రాల డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం అనే రీజన్ తో తను తప్పుకుందని.. మేం మరో హీరోయిన్ ను చూసుకుంటామని.. నుపుర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కు ఆల్ ద బెస్ట్ అని కూడా చెప్పాడు.


అయితే ఈ చిత్రం నుంచి నుపుర్ తప్పుకుందా.. లేక తప్పించుకుందా.. లేదా తప్పుకునేలా చేశారా అనే డిస్కషన్స్ టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్నాయి. మామూలుగా మంచు క్యాంప్ లో సినిమా అంటే అదో టార్చర్ అనేవాళ్లూ లేకపోలేదు. ఒకప్పటి తరంలా ఇప్పటి తరం లేదు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ ట్రెండ్ కు తగ్గట్టుగా యువత ఎలా ఉంటున్నారో ఆర్టిస్టులూ అందుకు మినహాయింపు కాదు. మొత్తంగా సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే హీరోయిన్ తప్పుకుందంటే.. అసలు ఈ మూవీ విడుదలవుతుందా అనే అనుమానం వస్తే అస్సలు తప్పేం కాదు.. అంటూ సెటైర్స్ వేసుకుంటున్నారు.

Related Posts