ఆ విషయంలో ప్రభాస్ కి గట్టి పోటీ ఇస్తోన్న ఎన్టీఆర్

సినిమాల స్పీడు విషయంలో తెలుగు అగ్ర కథానాయకులు బాగా వెనుకబడ్డారు.. గత కొన్ని సంవత్సరాల నుంచి మన స్టార్ హీరోస్ విషయంలో వినిపిస్తోన్న ప్రధానమైన కంప్లైంట్ ఇది. హీరోలుగా ప్రస్థానాన్ని ప్రారంభించి 20 ఏళ్లు, 30 ఏళ్లు దాటినా.. మన హీరోల సినిమాల సంఖ్య మాత్రం ఇంకా 30లు దాటకపోవడమే అలాంటి కామెంట్స్ కి కారణం. అయితే.. ఈసారి మన హీరోలు రూటు మార్చారు. గతంలో ఒక్కొక్క సినిమాకోసం సంవత్సరాల తరబడి సమయాన్ని వెచ్చించిన మన స్టార్స్ ఈసారి స్పీడు పెంచారు. ఇప్పుడు ఒకేసారి మూడు, నాలుగు సినిమాలను లైన్లో పెడుతున్నారు.

టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ సినిమాల స్పీడు మామూలుగా లేదు. ‘సలార్‘తో సెన్సేషనల్ హిట్ అందుకున్న రెబెల్ స్టార్.. ప్రస్తుతం ‘కల్కి‘ చిత్రాన్ని విడుదలకు ముస్తాబు చేస్తున్నాడు. ఈ ఏడాది వేసవి కానుకగా మే 9న ‘కల్కి‘ రావాల్సి ఉంది. అయితే.. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశంలోనూ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ‘కల్కి‘ చిత్రాన్ని వాయిదా వేస్తారనే ప్రచారం ఉంది.

‘కల్కి‘ తర్వాత మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‘ను విడుదలకు ముస్తాబు చేస్తాడు ప్రభాస్. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న ఈ సినిమా హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతోంది. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ‘స్పిరిట్‘, ప్రశాంత్ నీల్ తో ‘సలార్ 2‘ లైన్లో ఉన్నాయి. వీటితో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ హిస్టారికల్ పీరియడ్ ఫిల్మ్ ఉంది. మొత్తంగా ప్రభాస్ కిట్టీలో ఇప్పుడు ఐదు సినిమాలున్నాయి. దీంతో టాలీవుడ్ లోనే కాదు.. యావత్ పాన్ ఇండియా లోనే భారీ క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న స్టార్ గా ప్రభాస్ మొదటి వరుసలో నిలుస్తాడు.

తెలుగులో ప్రభాస్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న వాళ్లు గ్లోబల్ స్టార్స్ ఎన్టీఆర్, చరణ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కిట్టీలో ‘దేవర 1, 2‘, ‘వార్ 2‘, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా కూడా రెండు భాగాలుగా ఉంటుందనే ప్రచారం ఉంది. ఆ లెక్కన చూసుకుంటే ఎన్టీఆర్ కూడా ఐదు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నట్టే. రాబోయే రెండు, మూడేళ్లపాటు ఈ సినిమాలతోనే బిజీగా ఉండనున్నాడు తారక్.

మరోవైపు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముచ్చటగా మూడు ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతున్నాడు. ఈలిస్టులో ఇప్పటికే శంకర్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘గేమ్ ఛేంజర్‘ ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకుంది. త్వరలో బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందే ‘ఆర్.సి.16‘ పట్టాలెక్కనుంది. ఆద్యంతం ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందట. ఈ సినిమాకి ‘పెద్ది‘ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

చరణ్ కెరీర్ బెస్ట్ మూవీస్ లో ‘రంగస్థలం‘ది ప్రత్యేక స్థానం. తనకు ‘రంగస్థలం‘ వంటి అద్భుతమైన విజయాన్నందించిన సుకుమార్ డైరెక్షన్ లో మరోసారి పనిచేస్తున్నాడు చరణ్. ఇటీవల హోలీ స్పెషల్ గా ఈ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. ‘రంగస్థలం‘ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కూడా ‘ఆర్.సి.17‘కి పనిచేస్తున్నారు.

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతోన్న మరో స్టార్ హీరో అల్లు అర్జున్ సినిమాల లిస్ట్ కూడా క్రేజీగానే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2‘తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా సినిమాలను అధికారికంగా ప్రకటించాడు. అయితే.. ఈ రెండు ప్రాజెక్ట్స్ కంటే ముందే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం ఉంది. రాబోయే బన్నీ బర్త్ డే స్పెషల్ గా అట్లీ మూవీని అనౌన్స్ చేయనున్నారట.

టాలీవుడ్ నేటితరం స్టార్స్ లో ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ లతో పాటు పవన్ కళ్యాణ్ సినిమాల స్పీడు కూడా బాగానే ఉంది. ప్రస్తుతం పవన్ కిట్టీలో మూడు సినిమాలున్నాయి. అవే.. ‘ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు‘. అయితే.. పవన్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్స్ లో ఏవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి.

ఇక.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఒకే ఒక్క చిత్రంతో బిజీగా ఉన్నాడు. అది.. దర్శకధీరుడు రాజమౌళితో చేస్తున్న సినిమా. త్వరలోనే మహేష్-రాజమౌళి మూవీ అధికారికంగా ఓపెనింగ్ జరుపుకోనుంది.

Related Posts