Swayambhu : నిఖిల్ చాలా దూరం వెళ్లాడుగా

చిన్న సినిమాలతో పరిచయమైన తెలుగులో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు నిఖిల్. ఇప్పటి వరకూ భారీ బడ్జెట్ సినిమా అనే మాట అతను వినలేదు. కానీ మినీ బడ్జెట్ మూవీ కార్తికేయ2తో భారీ కలెక్షన్స్ సాధించి దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ మూవీ అతనికి దేశభక్తి అనే ట్యాగ్ కూడా తెచ్చింది.

అందుకే ఇప్పుడు ఆ తరహా చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కార్తికేయ2తో వచ్చిన ప్యాన్ ఇండియన్ ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం స్పై అనే థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. దీంతో ఏకంగా సుభాష్‌ చంద్రబోస్ మరణాన్ని ఛేదిస్తా అంటున్నాడు. తర్వాత కార్తికేయ 2 నిర్మాతతో కలిసి రామ్ చరణ్‌ నిర్మిస్తోన్న ది ఇండియా హౌస్ అనే మూవీ చేస్తున్నాడు.

ఇది సావర్కర్ కు సంబంధించిన కథ అంటున్నారు.ఇక ఇప్పుడు స్వయంభు అంటూ చాలా పెద్ద ట్యాగ్ తో వస్తున్నాడు. స్వయంభు అనేది దేవుళ్లకు వాడే మాట. ఆ మాటను టైటిల్ గా పెట్టుకుని మరో ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అతను వాపును చూసి బలుపు అనుకుంటున్నాడా అనే అనుమానం కలగక మానదు.

లేదంటే అతని ఇమేజ్ కు ఈ రేంజ్ మూవీ అనేది నిజంగా చాలా ఎక్కువ. అలాగని అతన్ని తక్కువ చేయడం లేదు. ఒకవేళ ఈ చిత్రాలన్నీ విజయం సాధిస్తే నిజంగానే ప్యాన్ ఇండియన్ స్టార్ అవుతాడు. బట్ ఇప్పుడిప్పుడే కంట్రీ మూడ్ మారుతోంది. దేశభక్తి చిత్రాల్లోని ‘ఆంతర్యాన్ని’ జనం గ్రహిస్తున్నారు. అది మరింత పెరిగితే నిఖిల్ కు ఉన్న ఇమేజ్ కూడా పోతుంది.

ఏదేమైనా కుర్రాడి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ స్వయంభు ఫస్ట్ లుక్ హాలీవుడ్ 300 రేంజ్ లో కనిపిస్తోంది. మరి మూవీ ఎలా ఉంటుందో కానీ.. ఈ లుక్ తర్వాత అతనిపై బానే సెటైర్స్ పడుతున్నాయి.

Related Posts