సంక్రాంతి బరిలోకి సైలెంట్ గా నాగార్జున

మిగతా సీజన్లను పక్కనపెడితే.. ఈమధ్య కాలంలో సంక్రాంతి సీజన్లలో సూపర్ హిట్స్ అందుకున్నాడు కింగ్ నాగార్జున. గత కొన్నేళ్లుగా ‘సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు, నా సామిరంగ’ వంటి సినిమాలు సంక్రాంతి సీజన్లలో వచ్చి మంచి విజయాలు సాధించాయి. ఇక.. లాస్ట్ ఇయర్ ‘నా సామిరంగ’తో వచ్చిన నాగార్జున.. వచ్చే సంక్రాంతికి కూడా తన సినిమా ఉంటుందని ముందే చెప్పాడు.

అయితే.. ఇప్పటివరకూ నాగార్జున హీరోగా నటించే కొత్త సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. ఒకవైపు శేఖర్ కమ్ముల ‘కుబేర’లో నటిస్తున్న నాగ్.. మరోవైపు తన అప్ కమింగ్ మూవీస్ కి సంబంధించి స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొంటూనే ఉన్నాడట. ఫైనల్ గా తనకు షార్ట్ పీరియడ్ లో ‘నా సామిరంగ’ వంటి హిట్ ఇచ్చిన విజయ్ బిన్నీతోనే సినిమా చేయాలని డిసైడయ్యాడట కింగ్.

‘నా సామిరంగ’ చిత్రాన్ని మలయాళం సినిమా ‘పొరింజు మరియమ్ జోస్’ రీమేక్ గా చేశారు. ఇప్పుడు చేయబోయే సినిమాని ఓ హాలీవుడ్ మూవీకి రీమేక్ గా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట నాగార్జున. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటోన్న ఆ మూవీకి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో చిరంజీవి, రవితేజ వంటి వారు బెర్తులు ఖరారు చేసుకున్నారు.

Related Posts