మల్టీ టాలెంటెడ్ యాక్టర్ శివాజీ బయోగ్రఫీ

సినీ వినీలాకాశంలో వెలిగిపోవాలని కలలుగనే వాళ్లు లక్షల్లో ఉంటారు. కానీ.. అన్ని సాదకబాధకాలు దాటుకుని రంగుల ప్రపంచంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే వారు కొంతమందే. అలాంటి వారిలో విలక్షణ నటుడు శివాజీ ఒకడు. బుల్లితెరపై ప్రస్థానాన్ని ప్రారంభించి.. వెండితెరపై హీరోగా, క్యారెక్టర్ యాక్టర్ గా వంద సినిమాల వరకూ చేసిన శివాజీ.. ఇప్పుడు డిజటిల్ దునియాని సైతం దున్నేస్తున్నాడు.

చెప్పులు లేని స్థితి నుండి ప్రారంభమై.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మదిలో ఓ విలక్షణ నటుడిగా స్థానం సంపాదించుకునే వరకూ ఎదిగిన శివాజీ జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. ఎంతో కఠోర శ్రమ దాగి ఉంది. పల్నాడు ప్రాంతంలోని వినుకొండలో 1971, జూన్ 30న పుట్టాడు శివాజీ. బిలో మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన శివాజీ.. 8వ తరగతి వరకూ చెప్పుల్లేకుండానే స్కూల్ కి వెళ్లేవాడట. తొమ్మిదో తరగతిలో నరసరావుపేట చదువుకోవడానికి వెళ్లినప్పుడే తన తండ్రి చెప్పులు కొనిచ్చారని చెబుతాడు శివాజీ.

డిగ్రీ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్ వచ్చిన శివాజీ.. తొలుత బుల్లితెరపై వ్యాఖ్యతగా ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అలా సినిమా వాళ్ల దృష్టిలో పడ్డ శివాజీకి వెండితెరపై చిన్న చిన్న ఆఫర్లు వచ్చాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మాస్టర్’ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో స్టూడెంట్ గా నటించి మంచి రికగ్నిషన్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి, ప్రేమంటే ఇదేరా, యువరాజు, ఖుషి‘ వంటి సినిమాలు శివాజీకి క్యారెక్టర్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ఒకవైపు క్యారెక్టర్ యాక్టర్ గా చేస్తూనే మరోవైపు అప్పటి యువ కథానాయకులకు డబ్బింగ్ కూడా చెప్పేవాడు. ఆ లిస్టులో నితిన్, ఆర్యన్ రాజేష్, యశో సాగర్ వంటి వారు ఉన్నారు. నితిన్ కి ‘జయం, దిల్’ సినిమాలకు శివాజీయే డబ్బింగ్ చెప్పాడు. ‘దిల్’ సినిమాకైతే ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా అందుకున్నాడు.

క్యారెక్టర్ యాక్టర్ గా ఎదుగుతున్న సమయంలోనే హీరోగా నటించే ఆఫర్లు వచ్చాయి. హీరోగా దాదాపు 60 సినిమాల్లో నటించాడు శివాజీ. వీటిలో ‘మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి, కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం, సత్యభామ‘ వంటి మంచి విజయాలున్నాయి. హీరోగా చేస్తున్న సమయంలోనే తానే నిర్మాతగా ‘తాజ్ మహాల్’ అనే చిత్రాన్ని నిర్మించాడు.

అయితే.. కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాదం కోసం బయటకు వచ్చాడు శివాజీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండాలని తన వాదన బలంగా వినిపంచాడు. ఆ సమయంలోనే సినిమాలకు దూరంగా వెళ్లాడు. అది శివాజీ కావాలని చేసుకున్నదే కానీ.. అతనికి సినిమాల నుంచి అవకాశాలు రాక కాదు.

మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ’90s.. ఎ మిడిల్ క్లాస్ బయోపిక్‘తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చాడు శివాజీ. ఒకవిధంగా శివాజీకి ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. ఈ సిరీస్ లో చంద్ర శేఖర్ పాత్రలో తండ్రిగా అదరగొట్టాడు శివాజీ. ప్రస్తుతం రెండు, మూడు సినిమాలలో హీరోగా చేస్తున్న శివాజీ.. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ మూవీలో విలన్ గానూ మురించబోతున్నాడు.

మొత్తంమీద.. చెప్పులు లేని స్థితి నుండి ప్రారంభమై ఆ తర్వాత మంచి ప్రణాళికతో ఆర్థికంగానూ బాగా నిలదొక్కుకున్న శివాజీ జీవితం ఎందరికో ఆదర్శం అని చెప్పాలి. మరి.. సెకండ్ ఇన్నింగ్స్ లో శివాజీ నుంచి ఇంకా ఎలాంటి పాత్రలు వస్తాయో చూడాలి.

Related Posts