ఓం భీమ్‌ బుష్ మూవీ రివ్యూ

నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతీ ముకుందన్, కామక్షి భాస్కర్ల, ప్రియావడ్లమాని, ఆయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి, షాన్ కక్కర్, సూర్య శ్రీనివాస్ తదితరులు
దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి
నిర్మాత: సునీల్ బలుసు
బ్యానర్: వీ సెల్యులాయిడ్
సమర్పణ: యువి క్రియేషన్స్
సినిమాటోగ్రఫి: రాజ్ తోట డీవోపీ
మ్యూజిక్: సన్నీ ఎంఆర్
ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రామిశెట్టి
ఎడిటర్: విష్ణువర్దన్ కావూరి
రిలీజ్ డేట్: 2023-03-22

‘ఓం భీమ్‌ బుష్’ అనే టైటిలే .. చాలా క్యాచీగా ఉంటుంది. ఈ టైటిల్ చూడటంతోనే ఇదో ఫన్‌ రైడ్ అనిపిస్తుంది. అందులో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లు మెయిన్‌లీడ్‌ చేయడంతో కామెడీ పీక్స్ అనే అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను ఓం భీమ్‌ బుష్ అందుకుందా.. అనుకున్నంత ఎంటర్‌టైన్ చేసిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ : కష్టపడకుండా సుఖపడాలనుకునే.. ఈజీగా మనీ సంపాదించాలనుకునే బ్యాచ్‌ కృష్ణకాంత్ (శ్రీవిష్ణు), వినయ్‌ గుమ్మడి (ప్రియదర్శి), మాధవ్‌ రేలంగి (రాహుల్ రామకృష్ణ). రంజిత్ వినుకొండ (శ్రీకాంత్ అయ్యంగార్) అనే ప్రొఫెసర్‌ దగ్గర లెగసీ యూనివర్సిటీలో సైంటిస్ట్‌లు కావాలనే కోరికతో జాయిన్ అవుతారు. అక్కడ వీరి తలతిక్క వేషాలకు, అల్లరి చిల్లరి పనులకు విసుగెత్తి ప్రొఫెసర్ రంజిత్ ఈ ముగ్గుర్నీ గెంటేస్తాడు. వినయ్ గుమ్మడి ఊరైన భైరవకొండకు వెళ్లే క్రమంలో ఓ పాడుబడ్డ బంగ్లాలో క్షుద్రపూజలు చేసే బైరాగి (షాన్‌ కక్కర్‌) బ్యాచ్‌ ను చూస్తారు. బ్యాంగ్ బ్రో A to Z సొల్యూషన్స్ అని ఏజెన్సీ పెట్టి వీరిచ్చే సలహాలతో ఫేమస్ అవుతుంటారు. దాంతో ఆ ఊరి సర్పంచ్‌, బైరాగిలకు వీరు టార్గెట్ అవుతారు. సంపంగి అనే దెయ్యం ఉన్న బంగ్లాలో నిధులను తీసుకురావాలని ఛాలెంజ్ చేస్తారు. ఆ ఛాలెంజ్‌లో వీరు నెగ్గారా… సంపంగిని ఎలా డీల్ చేసారు. ఆ ఊరి కష్టాలను ఈ ముగ్గురు బ్యాచ్‌ తీర్చిందా లేదా ? జలజ (ప్రీతి ముకుందన్) పాత్ర ఏంటి ? అనేవి తెరమీద చూడాల్సిందే.

కథనం : శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర చెప్పే కథగా ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ ముగ్గురు ఆ ప్రొఫెసర్ ని ఎలా వేధించారనేది ఫన్నీగా సాగుతుంది. ఎపిసోడ్ ఎపిసోడ్స్‌ గా కామెడీ ట్రాక్‌ హిలేరియస్‌ గా వర్కవుట్ అయ్యింది. నో లాజిక్ అని ముందుగానే డైరెక్టర్‌ చెప్పినట్టు లాజిక్‌ కు అతీతంగా కామెడీ పండించిన విధానం కడుపుబ్బ నవ్వేలా చేస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ సెకండాఫ్ పై క్యూరియాసిటీ పెంచేలా మంచి ట్విస్ట్ తో ముగుస్తుంది.
సెకండాఫ్‌లోనూ అదే ఫన్ రైడ్ కొనసాగినా… ఎమోషన్‌ మిక్స్ చేసాడు డైరెక్టర్. ఇది కూడా వర్కవుట్ అయ్యింది ఇక్కడ నుంచి ప్రతీ ట్విస్ట్‌కు లాజిక్‌తోనే నడిచేలా చేసాడు డైరెక్టర్‌. ఫ్లాష్‌ బ్యాక్‌ స్టోరీ హైలెట్‌. ఎమోషన్‌తో పాటు కథకు పూర్తి బలాన్నిచ్చింది ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరీనే. పెళ్లి ఎపిసోడ్‌తో పార్ట్‌ 2 కు లీడ్ ఇచ్చారు.

నటీనటులు : శ్రీవిష్ణు సామజవరగమనలో కామెడీ కేక పెట్టించాడు. ఇప్పుడు ఓం భీమ్‌ బుష్ నెక్ట్స్‌ లెవల్ అని చెప్పొచ్చు. కామెడీతో పాటు ఎమోషన్ కూడా బాగా పలికించాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలకు చెలరేగిపోయే స్కోప్ ఈ సినిమాలో దక్కింది. నిడివి తక్కువైనా రంజిత్ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ తనదైన ముద్ర వేసాడనే చెప్పాలి.
టెక్నికల్ విభాగాల విషయానికి వస్తే.. ప్రతీ విభాగం 100 శాతం ఫర్‌ఫెక్షన్ చూపించింది. ముఖ్యంగా రాజ్ తోట అందించిన సినిమాటోగ్రఫి, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీకాంత్ చేసిన వర్క్ స్క్రీన్‌పై అద్బుతంగా కనిపించింది. ఇక విష్ణు వర్దన్ ఎడిటింగ్ సినిమాను పరుగుల పెట్టిస్తే.. సన్నీ మ్యూజిక్ చాలా సన్నివేశాలను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక సునీల్ బలుసు, యూవీ క్రియేషన్స్ అనుసరించిన నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో ఉన్నాయి.

బోటమ్‌ లైన్‌ : ఓం భీమ్‌ బుష్‌. ఫుల్లీ ఫన్‌ రైడ్‌

రేటింగ్ : 3.25 / 5

Related Posts