సూపర్ స్టార్ యాంకర్ సుమ బయోగ్రఫీ

తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ అనగానే సుమ పేరే ముందుగా వినిపిస్తుంది. తన మాటల గారడీతో పలు ఛానెల్స్ లో పాపులర్ ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా వ్యవహరిస్తుంది సుమ. ఇక.. సినిమాల వేడుకలకు సుమ ఉంటే ఆ సందడే వేరు. ఇలా.. బుల్లితెర, వెండితెర వ్యాఖ్యానాలే కాదు.. అప్పుడప్పుడూ అడ్వర్ టైజ్ మెంట్స్ లోనూ దుమ్మురేపుతుంటుంది సుమ.

కేరళకు చెందిన సుమ మాతృ భాష తెలుగు కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు, యాంకరింగ్‌ చేస్తూ ఈ రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవడం మామూలు విషయం కాదు. అది కూడా వ్యాఖ్యాన రంగంలో సూపర్ స్టార్ గా. అందుకే సుమ ను సూపర్ స్టార్ యాంకర్ అనొచ్చు.

సుమ పుట్టింది మార్చి 22, 1975న. తండ్రి పి.ఎన్.కుట్టి, తల్లి పి.విమల. వీరు చాలా సంవత్సరాలు సికింద్రాబాద్లో ఉన్నారు. అలా సుమ హైదరాబాదులో ఉండటంతో సహజంగా తెలుగు భాషమీద పట్టు సాధించింది. లాంగ్వేజెస్ లో ఆమె తెలుగు సబ్జెక్టును ఎంచుకోవడంలో తన తల్లి పాత్ర ఎక్కువగా ఉందని అంటుంది సుమ.

సుమ తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్ లో చేస్తుండగా రాజీవ్ కనకాలతో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. 1999, ఫిబ్రవరి 10న వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, ఒక పాప. సుమ తనయుడు రోషన్ బబుల్ గమ్ సినిమాతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే.

చక్కటి వ్యాఖ్యానం, చిరునవ్వు, సమయస్ఫూర్తితో వ్యాఖ్యాత గా తనకు ఈ రంగంలో తిరుగు లేదనిపిస్తూ సాగుతుంది సుమ. తెలుగు, మలయాళంతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలోను మాట్లాడగలదు.

ఇక బుల్లితెరపై పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే వంటి ప్రోగ్రామ్స్ తొలుత వ్యాఖ్యాతగా సుమ కి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇంకా క్యాష్, స్టార్ మహిళ, సూపర్ సింగర్, అవాక్కయ్యారా?, జీన్స్, పట్టుకొంటే పట్టుచీర, లక్కు కిక్కు వంటి ప్రోగ్రామ్స్ సుమ ని యాంకర్ గా మరో లెవెల్ లో నిలబెట్టాయి.

బుల్లితెరతో పాటు మరోవైపు వెండితెరపై కళ్యాణ ప్రాప్తిరస్తు, పవిత్ర ప్రేమ, వర్షం, ఢీ, స్వయంవరం, రావోయి చందమామ, స్వరాభిషేకం, జయమ్మ పంచాయతీ వంటి చిత్రాల్లో ప్రాధాన్యత గల పాత్రల్లో అలరించింది. వ్యాఖ్యాతగా, నటీమణిగా సుమ ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.

Related Posts