Laxmideepak : తెలుగు సినిమాపై జెండా ఎగరేసిన ఆ కాలం తెలంగాణ దర్శకుడు

తెలుగు సినిమాపై జెండా ఎగరేసిన ఆ కాలం తెలంగాణ దర్శకుడు
అద్భుతమైన చిత్రాలు రూపొందించిన లక్ష్మీ దీపక్ గురించి మీకు తెలుసా..?

లక్ష్మీ దీపక్ .. సినిమా మనిషిగా పెద్దగా ఫేమ్ లో లేని పేరు. కానీ ఆయన చేసిన సినిమాల పేర్లు చెబితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. రాశిలో తక్కువైనా వాసిలో నాణ్యమైన సినిమాలు అందించాడు లక్ష్మీ దీపక్. అసలు సినిమాల్లోకి ఆయన ప్రయాణమే చిత్రంగా సాగింది. తొలి సినిమా నుంచి ఆఖరి సినిమా వరకూ అదో రకమైన ఆవేశం నిండి ఉండే లక్ష్మీదీపక్ సినిమాలు ఇప్పుడు వచ్చినా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. మరి ఆయన సినిమాలేంటీ, నేపథ్యం ఏంటీ అనేది చూద్దాం..

లక్ష్మీ దీపక్ అసలు పేరు లక్ష్మీ నారాయణ. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడు. చదువుకునే రోజుల్లోనే సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. హైదరాబాదీ కావడంతో చదువు ఉర్ధూలో సాగింది. అందుకే తన సినిమా కలను బొంబాయిలో నెరవేర్చుకోవాలని అక్కడికి వెళ్లాడు. కానీ ఏ ఎక్స్ పీరియన్స్ లేదని ఎవరూ అసిస్టెంట్ గా తీసుకోలేదు. దీంతో మళ్లీ హైదరాబాద్ వచ్చిన ఆయనకు అదృష్టం నటుడు, నిర్మాత ప్రభాకర్ రెడ్డి రూపంలో తగిలింది. ప్రభాకర్ రెడ్డి కంటే ముందే ఆయనకు అట్లూరి పూర్ణచందర్ ఆయన ద్వారా ప్రత్యగాత్మ, రామినీడు పరిచయమయ్యారు. అలా రామినీడు చిత్రాలకు అసిస్టెంట్ గా కెరీర్ మొదలుపెట్టాడు. తర్వాత చివరకు మిగిలేది చిత్రానికి అసిస్టెంట్ గా మద్రాస్ వెళ్లారు. ఆచిత్రంలో నటిస్తోన్న ప్రభాకర్ రెడ్డితో స్నేహం తర్వాత లక్ష్మీ దీపక్ కు నిజంగానే లక్ మొదలైంది.

రామినీడు వద్ద కలిమిలేములు, మరో దర్శకుడు హేమాంబరధరరావు వద్ద కలవారి కోడలు, దేవత, పొట్టి ప్లీడరు, వీలునామా, శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్నకథ, ఆడపడుచు, కథానాయకుడు వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి డైరెక్షన్ ల మెళకువలు నేర్చుకున్నాడు. అయితే దర్శకుడిగా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టే టైమ్ లో ప్రభాకర్ రెడ్డి స్వయంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి అతన్ని దర్శకుడిగా పరిచయం చేశారు. అలా 1970లో కృష్ణ, వాణిశ్రీ జంటగా నటించిన ‘పచ్చని సంసారం’ తో లక్ష్మీ నారాయణ దర్శకుడు లక్ష్మీ దీపక్ మారారు. పచ్చని సంసారం మంచి హిట్ అయింది. దీంతో వెంటనే కూతురు కోడలు, జగత్ జెంత్రీలు చేశాడు. అవీ కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా జెగత్ జెంత్రీలు తో శోభన్ బాబుతో మాస్ సినిమా చేయించి ఆశ్చర్యపరిచాడు.


లక్ష్మీ దీపక్ లక్కీ హ్యాండ్ అన్న పేరు వచ్చింది. ఇక 1972లో తీసిన పండంటి కాపురంతో అతనికి స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆ చిత్రానికి ఆ యేటి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డ్ రావడమే అందుకు కారణం. ఉమ్మడి కుంటుంబాల్లో అనుబంధాలు, అపార్థాలు, కలహాలను అత్యద్భుతంగా ఆవిష్కరించాడీ చిత్రంలో. ఎస్ వి రంగారావు శిఖర స్థాయి నటనకు తోడు ప్రభాకర్ రెడ్డి, కృష్ణ, విజయ నిర్మల, గుమ్మడి, జమున, అల్లు రామలింగయ్య లాంటి హేమాహేమీల కలయిక ఈ చిత్రానికి మరింత వన్నె తెచ్చింది.

అప్పటి నుంచి లక్ష్మీ దీపక్ విజయ పరంపర మొదలైంది. ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డితో ఆయన చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి. ప్రభాకర్ రెడ్డి నిర్మాతగా, నటుడిగా పేరు తెచ్చుకున్నదీ, లక్ష్మీ దీపక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నదీ వీరి సినిమాల ద్వారానే కావడం విశేషం.లక్ష్మీ దీపక్ ప్రతిభ అంతా స్క్రీన్ ప్లే లో కనిపిస్తుంది. కథ అనుకున్న తర్వాత దాన్ని కథనంగా మార్చడంలో దీపక్ ఎక్స్ పర్ట్ గా చెబుతారు. ఓ రకంగా ఇది ఆయనలో ఆత్మవిశ్వాసంతో పాటు కాస్త అతిశయాన్ని కూడా తెచ్చింది. ఈ విషయం ఆయన దర్శకుడికి సంబంధించి చెప్పిన స్టేట్మెంట్, తర్వాత దాన్ని మార్చుకున్న విధానం చూస్తే అర్థం అవుతుంది. దర్శక నిర్మాతలకు సంబంధించి లక్ష్మీదీపక్ కు ఉన్న అభిప్రాయానుసారంగానే ఎన్టీఆర్ తో ‘‘మహాపురుషుడు’’ అనే సినిమా చేశారు. కానీ పూర్తిగా ఆయన అభిప్రాయాలతోనే రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. దీంతో తన అభిప్రాయం తప్పని మళ్లీ ఒప్పుకుని అందరి మెప్పును పొందారు లక్ష్మీ దీపక్.


ఇక పూర్తి సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని లక్ష్మీ దీపక్ డైరెక్ట్ చేసిన సినిమాలు.. నాకు స్వతంత్రం వచ్చింది ,గాంధీ పుట్టిన దేశం. ఈ రెండూ విభిన్నమైన సామాజిక అంశాలతో రూపొందినవే. ఒకటి జాలర్ల జీవితాలను తెలియజేస్తే మరొకటి పెత్తందార్ల కింద నలిగే పాలేర్లు, కూలీల జీవితాల్ని ప్రతిబింబించింది. ఈ రెండు చిత్రాల్లోనూ రెబల్ స్టార్ కృష్ణం రాజు ప్రధాన పాత్రలు పోషించారు.. ముఖ్యంగా నాకు స్వతంత్రం వచ్చిందిలో సముద్రం వద్ద కామందుతో కృష్ణంరాజు చెప్పిన డైలాగులు చూస్తే నేడు ఆయన వారసుడు ప్రభాస్ పై ఆయన ముద్ర ఎంత ఉందనేది అర్థం అవుతుంది. ఈ రెండు చిత్రాలు నటుడిగా ఆయన్ని మరో మెట్టుపైకి తీసుకువెళ్లడం విశేషం..


దర్శకుడిగా లక్ష్మీ దీపక్ ను ఎవర్ గ్రీన్ చేసిన మరో సినిమా కార్తీకదీపం. శోభన్ బాబు, శారద, శ్రీదేవి నటించిన ఈ సినిమాతోనే శోభన్ బాబు ఇద్దరు హీరోయిన్లతో నటించడం మొదలుపెట్టారు.. కేవలం నాలుగు ప్రధాన పాత్రల మధ్యే కథ నడపడం ఈ చిత్ర విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. అదే లక్ష్మీదీపక్ లోని స్క్రీన్ ప్లే టెక్నిక్. కార్తీక దీపం ఇప్పటికీ కార్తీక పౌర్ణమి రోజున టివిల్లో కనిపిస్తూనే ఉంటుంది. అందుకు కారణం.. ఆ చిత్రం సాధించిన విజయం మాత్రమే కాదు, కథ, కథనం. అదే లక్ష్మీదీపక్ లోని ప్రత్యేకత కూడా. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకోవడం వల్లే ముందు నుంచీ అతని ఖాతాలో ఎక్కువ విజయాలున్నాయి.
నటుడు మోహన్ బాబు కెరీర్ తొలినాళ్లలో లక్ష్మీదీపక్ వద్ద అసిస్టెంట్ గా పనిచేశారంటే ఆశ్చర్యం కలగక మానదు.

అలాగే సీనియర్ నరేష్, జయసుధ కూడా తొలిసారిగా కెమెరా ముందుకువచ్చిందీ లక్ష్మీ దీపక్ సినిమాతోనే. పండంటి కాపురంలో నరేష్ ను బాలనటుడిగా, జయసుధను టీనేజర్ గా తొలిసారిగా స్క్రీన్ పై చూపించారు దీపక్. మొత్తం కెరీర్ లో ముఫ్ఫై వరకూ సినిమాలకు దర్శకత్వం వహించాడు లక్ష్మీ దీపక్. వీటిలో తనే నిర్మిస్తూ డైరెక్ట్ చేయగా ఫ్లాప్ అయిన ధైర్యవంతుడు కూడా ఉంది. దీంతో పాటు గూడుపుఠాని, హారతి, ఇంటికోడలు, వయసొచ్చిన పిల్ల, వింత ఇల్లు సంతగోల, ఈ కాలపు పిల్లలు, ఏడడుగుల బంధం, ధర్మ చక్రం, సన్నాయి అప్పన్న,తెలుగునాడుతో పాటు చివరి సినిమా ఇంటింటా దీపావళి కూడా ఉంది..
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీ రాసుకున్న లక్ష్మీ దీపక్ కెరీర్ ఖచ్చితంగా పాజిటివ్ గానే సాగింది. 1990లో వచ్చిన ఇంటింటా దీపావళి ఆయన చివరి చిత్రం. తర్వాత పదేళ్లకు 2001 జూన్ 10న ఆయన కన్నుమూశారు.

Related Posts