Ahimsa : తేజ ఇక కోతలరాయుడుగా మిగిలిపోవడమేనా.. ?

ఒక్కో దర్శకుడికి ఒక్కో టైమ్ నడుస్తుంది. ఆ టైమ్ లోవాళ్లు వెలిగిపోవడం.. పరిశ్రమలో తిరుగులేని గుర్తింపు రావడం కామన్. కానీ ఆ గుర్తింపు ఇచ్చిన కాలాన్నే అన్ని కాలాలాకీ అన్వయిస్తూ కూర్చుంటే అదీ పోతుంది. తర్వాత కాలంలో రావాల్సిన పేరూ రాకుండా పోతుంది. ప్రస్తుతం ఈ స్టేజ్ లోనే ఉన్నాడు తేజ.

దీనికి తోడు మనోడు ఓ రేంజ్ లో బిల్డప్స్ ఇస్తుంటాడు. తనేదో అద్భుతమైన దర్శకుడననీ.. ఇప్పటి వరకూ ఇండస్ట్రీ గతిని మార్చిన కథలన్నీ తనే చేశాననీ చెప్పుకుంటూ ఉంటాడు. పోనీ సొంత డబ్బా అనుకుంటే దాన్ని దాటి ఇతర దర్శకులు, హీరోలు, కథలపై సెటైర్స్ వేస్తుంటాడు. అక్కడికి తనేదో గొప్ప కథలు చెబుతున్నట్టుగా..? ఎప్పుడో చిత్రం, నువ్వు నేను, జయం చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత సక్సెస్ అనే మాటే అతని దరి చేరలేదు.

ఆ మధ్య రానా హీరోగా నేనే రాజు నేనే మంత్రి అనే మూవీతో కమర్షియల్ హిట్ కొట్టాడు. కానీ ఇది బాహుబలి తర్వాత రావడం.. కాజల్ వంటి క్రేజీ హీరోయిన్ ఉండటంతో కలిసొచ్చింది. అంతే తప్ప.. ఈ కథలోకూడా అంత దమ్మేం ఉండదు. అయినా ప్రతి సినిమా టైమ్ లోనూ ఇతర దర్శకులపై విమర్శలు చేసే తేజ మరోసారి అదే రొడ్డకొట్టుడు కథతో జనాన్ని కావాల్సినంతగా హింసించాడు.


దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి అభిరామ్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు. అహింస అనే టైటిల్ తో వచ్చాడు. కానీ సినిమా ఆసాంతం జయం, నువ్వు నేను టెంప్లేట్ లోనే సాగుతుంది.కాకపోతే హీరోయిన్ లైంగిక దాడికి గురవుతుంది. ఈ పాయింట్ తో కొంత కొత్తదనం చూపిస్తాడు అనుకుంటే.. చాలా ఇంటెన్సిటీతో, ఎమోషనల్ గా సాగాల్సిన డ్రామాను అడవుల పాలు చేసి.. ఆడియన్స్ తో ఆడుకున్నాడు. తేజ చెప్పే మాటలకు.. చూపే కథలకు అస్సలు సంబంధమే ఉండదని మరోసారి ప్రూవ్ అయింది. తనేదో గొప్ప కథ చెబుతున్నట్టుగా భావించినా.. చాలా బాధ్యతా రాహిత్యంగా ప్రీ రిలీజ్ రోజునే ఇదో స్క్రాప్ మూవీ ఇన్ డైరెక్ట్ గా సురేష్‌ బాబే చెప్పాడు అన్నాడు.

అలాంటప్పుడు రిలీజ్ చేయనివ్వడం ఎందుకు..? పోనీ అతనే చెప్పుకున్నట్టుగా రిలీజ్ తన బాధ్యత కాదు. కానీ ఆ స్క్రాప్ తీసింది తనే కదా..? నటనలో ఓనమాలు తెలియని కుర్రాడు హీరో అయినప్పుడు ఏ మాత్రం తెలివైన దర్శకుడైనా అతని ప్రతిభకు తగ్గ కథతో వస్తాడు. కానీ ఈ కథలో హీరో చాలా ఎమోషన్స్ పలికించాలి. ఇందులో అభిరామ్ జీరో. అయినా అంత బరువైన కథతో అతన్ని పరిచయం చేయాలనుకోవడం ఏం తెలివైన పని.


ఏదేమైనా తేజ అంటే కొన్నాళ్లుగా చూస్తున్నట్టుగా కోతల రాయుడుగా మిగిలిపోతున్నాడు. ప్రతి సినిమా టైమ్ లో తనేదో కళాఖండం తీసినట్టుగా చెప్పకనే చెబుతూ.. ఇతర దర్శకులు, వారి కథలు, హీరోయిజంపై సెటైర్స్ వేయడం.. ఓ రకంగా అక్కసు వెళ్లగక్కడం తప్ప నిజంగా అతనిలో మేటర్ లేదు అనే విషయం ఎప్పుడో తేలిపోయింది. లేదంటే ఎప్పుడో తన చేతిలోనే అవుట్ డేటెడ్ అయిపోయిన జయం ఫార్ములానే ఇంకా పట్టుకుని వేళ్లాడ్డం దాన్నే గొప్ప ఫార్ములా అనుకోవడం అతనికే చెల్లింది. ఇదే ఫార్మాట్ లో మరో సినిమా చేస్తే.. (చేయకపోయినా) అతన్ని కోతలరాయుడుగానే పరిగణిస్తారు ప్రేక్షకులు

Related Posts