‘రామాయణ్’ కోసం హాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్

భారతీయులకు అత్యంత ఇష్టమైన పురాణ గాథ రామాయణం. రామాయణాన్ని ఎన్నిసార్లు వెండితెరపై చూసినా తనివితీరదు. అందుకే.. ఇప్పుటికే పలుమార్లు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసిన రామాయణంను మరోసారి ఆవిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి మూడు భాగాలుగా ఈ పురాణగాథను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ నితీష్ తివారి.

రణ్ బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణ పాత్రలో కనువిందు చేయబోయే ‘రామాయణ్’ మూవీలో సన్నీ డియోల్, బాబీ డియోల్, నవీన్ పోలిశెట్టి వంటి ఎంతోమంది నటీనటులు కనిపించనున్నారట. పురాణ పురుషుడు శ్రీరాముడు కథను ప్రపంచానికి పరిచయం చేయడానికి అంతర్జాతీయ సాంకేతిక విలువలతో ‘రామాయణ్’ను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు నితీష్ తివారి. అందుకోసం.. ఇంటర్నేషనల్ గా ఫేమస్ టెక్నీషియన్స్ ను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకుంటున్నాడట.

ఈకోవలోనే.. హాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్ ను ‘రామాయణ్’లోకి తీసుకున్నట్టు బాలీవుడ్ టాక్. రెండు ఆస్కార్లు, నాలుగు గ్రామీ అవార్డులు అందుకున్న హాన్స్ జిమ్మర్.. ‘ది లయన్ కింగ్, గ్లాడియేటర్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్, ది డార్క్ నైట్ ట్రయాలజీ, ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్’ వంటి ఎన్నో కమర్షియల్ హిట్స్ కు మ్యూజిక్ అందించాడు. హాన్స్ జిమ్మర్ తో పాటు.. మరో ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ కూడా ‘రామాయణ్’కి సంగీతాన్ని సమకూర్చనున్నాడనే ప్రచారం జరుగుతుంది.

మొత్తంమీద.. కొన్ని రోజులుగా సినీ ప్రేమికుల్లో ఎంతో ఆసక్తిని కలగజేస్తున్న ఈ ‘రామాయణ్’పై అధికారిక ప్రకటన కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈనెల 17న శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించనున్నారనే ప్రచారం జరుగుతుంది.

Related Posts