గూస్ బంప్స్ తెప్పించేలా ‘గేమ్ ఛేంజర్‘.. అసలు కథేంటి?

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో సినిమా చేయాలనేది చిరంజీవి చిరకాల కోరిక. మెగాస్టార్ కి వర్కవుట్ కాకపోయినా.. ఇప్పుడు ఆయన తనయుడు చరణ్ సాధించాడు. శంకర్ తో ‘గేమ్ ఛేంజర్‘ సినిమా చేస్తున్నాడు. వెండితెరపై భారీ బడ్జెట్ తో సందేశాత్మక కథాంశాలను తెరకెక్కించే శంకర్.. ఈసారి చరణ్ సినిమాకోసం మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథను నమ్ముకున్నాడు.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ‘గేమ్ ఛేంజర్‘ కథ రాశాడు కార్తీక్ సుబ్బరాజ్. ఈ సినిమాలో చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. చెర్రీ కెరీర్ లో ‘నాయక్‘ సినిమాకోసం డ్యూయల్ రోల్ చేశాడు. కానీ.. తండ్రీకొడుకులుగా చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కథ గురించి ఓ ఆసక్తికర కథనం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఈ మూవీలో అప్పన్న అనే పాత్రలో సీనియర్ చరణ్ కనిపిస్తాడట. అతను ఓ పొలిటికల్ పార్టీని స్థాపిస్తాడట. శ్రీకాంత్ అతనికి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని చేజిక్కించుకోవడం.. ఆ తర్వాత శ్రీకాంత్ వారసులు ఎస్.జె.సూర్య, నవీన్ చంద్ర ఆ పార్టీని నడిపించడం జరుగుతందట. కట్ చేస్తే.. అప్పన్న తనయుడైన రామ్ (రామ్ చరణ్).. ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయ్యి.. ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చి విలన్లకు ఎలా బుద్ధి చెప్పాడనేది ‘గేమ్ ఛేంజర్‘ కథగా ప్రచారమవుతోంది.

ఇక.. లేటెస్ట్ గా వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటోన్న ‘గేమ్ ఛేంజర్‘ మూవీ నుంచి లీకైన ఫోటోలయితే ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ గా చరణ్ లుక్ అయితే అదిరిపోయింది. హీరోయిన్ కియారా కూడా కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా ఈ మూవీలో మంచి రోల్ తో మురిపించబోతుందని ఆమె లీక్డ్ లుక్ చూస్తేనే అర్థమవుతోంది. మొత్తానికి.. చరణ్ కెరీర్ లో ‘గేమ్ ఛేంజర్‘ ఎంతో ప్రత్యేకంగా నిలవబోతుందని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు.

Related Posts