గేమ్ చేంజర్.. డైరెక్టర్ చేంజ్ అయ్యాడా..

రామ్ చరణ్ ఎన్నో అంచనాలతో మొదలుపెట్టిన సినిమా గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ తర్వాత మరో ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ అయిన శంకర్ తో సినిమా అంటే దాని బిజినెస్ రేంజ్ తో పాటు తన రేంజ్ కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుందని భావించాడు. ఈ విషయంలో చిరంజీవి సైతం చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. వారి ఆనందం ఎక్కువ షెడ్యూల్స్ నిలవలేదు.

ఈ సినిమా ఇలా మొదలై ఓ రెండు మూడు షెడ్యూల్స్ అయిందో లేదో.. శంకర్ భారతీయుడు2 కేస్ ఓడిపోయాడు. ఖచ్చితంగా సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ దశలో రెండు సినిమాలకూ చెరో వారం కేటాయించాలనుకున్నాడు. కానీ భారతీయుడు2కు భారీ సెట్స్ ఉండటంతో కుదరలేదు. దీంతో గేమ్ ఛేంజర్ అలా అలా వెనకబడిపోతూ వచ్చింది.

కొన్నాళ్లుగా ఈ సినిమా గురించి ఫ్యాన్స్ కూడా పట్టించుకోవడం మానేశారు. దీంతో ఇలాగే ఉంటే మొత్తం సినిమాకే నష్టం తప్పదని భావించిన నిర్మాత దిల్ రాజు దర్శకుడినే మార్చాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. కాకపోతే శంకర్ ను పూర్తిగా తొలగించలేదు.


లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్ మూవీ కోసం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారు. అయితే దీన్ని మరో దర్శకుడు హిట్ మూవీ ఫ్రాంచైజీస్ తో ఆకట్టుకున్న శైలేష్‌ కొలను పర్యవేక్షించబోతున్నాడు. యస్.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సెకండ్ యూనిట్ గా చెబుతున్న ఈ పార్ట్ శైలేష్ కొలను ఆధ్వర్యంలో సాగుతోంది. ఇది ఎవరూ ఊహించలేదు.

అయితే ఇలా చేయడానికి కారణం ఏంటో చూశాం కదా.. ? దిల్ రాజు ఈ మూవీని ఎలాగైనా సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నాడు. ఆ డేట్ లో ముందుగా భారతీయుడు2 విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉంది.

దీంతో లేట్ అవుతుందని నిర్మాతలు రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. దీంతో సంక్రాంతి స్లాట్ లో తన గేమ్ మొదలుపెట్టాలనే దిల్ రాజు ఈ కొత్త గేట్ స్టార్ట్ చేశాడు. ఈ మేరకు శంకర్ నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నట్టు సమాచారం.

ప్రస్తుతం శంకర్ చేయగలిగింది కూడా ఏం లేదు. అందుకే శైలేష్‌ కొలను డైరెక్షన్ కు శంకర్ కూడా తలొంచక తప్పలేదు. మరి ఈ ఇద్దరి దర్శకత్వం సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కానీ.. శైలేష్‌ మాత్రం తనకు కుదిరినప్పుడల్లా దిల్ రాజు కోసం టైమ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడట. మరి టైటిల్ క్రెడిట్స్ లో కూడా అతని పేరు ఉంటుందా లేదా అనేది చూడాలి.

Related Posts