స్కంద.. ఆలస్యం అయినా మేల్కొన్నారు

చిన్నదైనా, పెద్దదైనా ఒక సినిమాకు ప్రమోషన్స్ ఎంత కీలకం అనేది ప్రతి ఫిల్మ్ మేకర్ కూ తెలుసు. అయినా ఆ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం అంటే వాళ్ల ఫ్లాపును వాళ్లే పేర్చుకుంటున్నట్టుగా భావించాలి. నిన్నటి వరకూ స్కంద మూవీ విషయంలోనూ ఇదే కనిపించింది. రిలీజ్ కు వారం కూడా లేదు. అయినా ప్రమోషన్స్ అంటూ ఏం కనిపించడం లేదు అంటూ చాలామంది అనుమానపడ్డారు. మామూలుగా ప్రమోషన్స్ మరీ ఎక్కువైతే సినిమాలో విషయం వీక్ అని ఎలా అనుకుంటారో.. అసలే లేకపోయినా ఎలాగూ పోయే సినిమాకు ప్రమోషన్స్ ఎందుకు అనుకున్నారేమో అని కూడా అనుకుంటారు. స్కంద విషయంలో ఇవి చాలా ఎక్కువే వినిపించాయి. అందుకే కాస్త ఆలస్యం అయినా మేల్కొన్నారు. రామ్, శ్రీ లీలతో కలిపి యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూ చేయించారు. ఈ ఇంటర్వ్యూ ను బట్టి సినిమాపై ఒక అంచనాకు రావొచ్చు. విశేషం ఏంటంటే.. ఈ మూవీ ప్రమోషన్స్ కు డేట్స్ ఇవ్వను అని చెప్పింది శ్రీ లీల. అయినా తనను బానే ఒప్పించారు. మొత్తంగా లేట్ అయినా ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయ్యాయి.


రామ్ పోతినేని, శ్రీ లీల, సాయీ మంజ్రేకర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరెక్ట్ చేశాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు. థమన్ సంగీతం చేశాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో ఇది కంప్లీట్ గా బోయపాటి మార్క్ ఊరమాస్ ఎంటర్టైనర్ అనిపించింది. అతని గత సినిమాల ఫార్మాట్ లోనే ఉంది. కేవలం హీరో తల మాత్రం మారింది అంతే అన్న కమెంట్స్ వచ్చాయి. అయినా ఈ తరహా మాస్ మూవీస్ కే కదా ఆడియన్స్ ఎక్కువగా వస్తారు. అదే బోయపాటి నమ్మకం కూడా కావొచ్చు.


ఇక తెలుగులోనే చాలా వీక్ ప్రమోషన్స్ ఉన్న ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా విడుదల చేయబోతున్నారు. ఆ స్థాయిలో సినిమా ఎక్కాలి అంటే ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ అయి వారం రోజులై ఉండాలి. బట్ వీళ్లు అలా చేయడం లేదు. అంటే ప్యాన్ ఇండియన్ రిలీజ్ అనే మాటను లైట్ తీసుకున్నారా లేక వచ్చిన వరకూ చాల్లే అనుకుంటున్నారా అనేది తెలియదు కానీ.. మొత్తంగా ఇంటర్వ్యూ అయింది. ఇది మాత్రమేనా ఇంకా ఉంటాయా అనేది ముందు ముందు తెలుస్తుంది.

Related Posts