ఈ వారం వస్తోన్న చిత్రాలలో అసలుసిసలు పోటీ ‘ఫ్యామిలీ స్టార్, మంజుమ్మల్ బాయ్స్’ మధ్యే ఉండబోతుంది. ఇన్ డైరెక్ట్ గా చెప్పాలంటే నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య పోటీగా కూడా దీన్ని అభివర్ణించొచ్చు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా నైజాం ఏరియాలో రారాజులా వ్యవహరించాడు దిల్ రాజు. అయితే.. మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీ రంగంలోకి ప్రవేశించడంతో దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థకి నైజాంలో పెద్ద కాంపిటేషన్ మొదలైంది.
‘వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, సలార్, హనుమాన్’ వంటి చిత్రాలతో నైజాంలో తమకూ తిరుగులేదనిపించుకున్నారు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు. ఇప్పుడు వీరి ఆధ్వర్యంలోనే మలయాళీ బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ లెవెల్ లో రిలీజవుతోంది.
ఒక్కరోజు గ్యాప్ లో వస్తోన్న ఈ సినిమాల కంటెంట్ విషయానికొస్తే.. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతుంది ‘ఫ్యామిలీ స్టార్’. 150 నిమిషాల నిడివితో మిమ్మల్ని ఆద్యంతం ఫ్యామిలీ ఎమోషన్స్ తో కట్టిపడేసే సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ అంటూ ప్రచారం చేస్తున్నారు మేకర్స్. మరోవైపు ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ సర్వైవల్ థ్రిల్లర్ గా వస్తోంది. ఇప్పటికే మలయాళం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన కంటెంట్ కావడంతో ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు సైతం ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నారు పంపిణీదారులైన మైత్రీ అధినేతలు.