ఎవర్ గ్రీన్ బ్యూటీ మీనా బర్త్ డే స్పెషల్

వెండితెరపై బాల నటిగా తెరంగేట్రం చేసింది మీనా.హీరోయిన్ గా తొంభై దశకంలో సౌత్ లో టాప్ హీరోలందరితోనూ జోడీ కట్టింది. గ్లామర్ కీ, నటనకీ ప్రాధాన్యమున్న పాత్రల్లో మెప్పించిన ఆ కాలం బ్యూటీస్ లో మీనాది డిఫరెంట్ స్టైల్. తెలుగులో టాప్ ఫోర్ హీరోస్ లానే టాప్ ఫోర్ హీరోయిన్స్ రంభ, రమ్యకృష్ణ, రోజా, మీనా అంటూ ఒకరుగా వెలిగింది. హీరోయిన్ గా కెరీర్ తగ్గుతుందని భావించిన టైమ్ లో ట్రెండ్ కు తగ్గట్టుగా విపరీతమైన గ్లామర్ రోల్స్ కూడా చేసింది మీనా. ప్రస్తుతం మరో ఇన్నింగ్స్ లోనూ అదరగొడుతున్న మీనా బర్త్ డే ఇవాళ(శనివారం).


మీనా పుట్టిపెరిగింది చెన్నైలోనే. తండ్రి దురైరాజ్ స్కూల్ టీచర్, తల్లి రాజమల్లిక అలనాటి తమిళ చిత్ర నటి. మీనా తండ్రి తెలుగు ప్రాంతం నుంచి మద్రాస్ వెళ్లాడు. చిన్నతనం నుంచే బాలనటిగా వెండితెరపై వెలిగిపోయింది. అందుకే మీనాను హీరోయిన్ గానూ చాలా ఈజీగా ఓన్ చేసుకున్నారు ప్రేక్షకులు. అమాయకమైన చూపులు, అందమైన నవ్వుతో బాలనటిగానే 30కి పైగా సినిమాలు చేసి దక్షిణాది ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. కోదండరామిరెడ్డి, శోభన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఇల్లాలు ప్రియురాలులో బాలనటిగా ఆకట్టుకుంది. ఆ తర్వాత జంధ్యాల రెండురెళ్లు ఆరులోనూ బొద్దుగా ముద్దుగా కనపించింది. కళాతపస్వి విశ్వనాథ్ తీసిన సిరివెన్నెలలో చిన్నతనంలోనే చూపుకు దూరమైన కారక్టర్ లో మెప్పించింది. మీనాను నటిగా తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకుంది కూడా అప్పుడే.

సీతారామయ్యగారి మనవరాలుతో మీనా హీరోయిన్ గా ప్రమోషన్ తీసుకుంది. అక్కినేని నాగేశ్వరావు, రోహిణి హట్టంగడి వంటి మోస్ట్ సీనియర్ స్టార్స్ ముందు ఏ మాత్రం జంకు లేకుండా అద్భుతమైన అభినయంతో అఖిలాంధ్ర ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. అక్కినేని కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సన్నివేశాల్లో మీనా నటన ఎంత మెచ్యూర్ గా ఉంటుందో చెప్పలేం. అందుకే తాత, మనవరాలు అనగానే నేటికీ తెలుగు వారికి ఈ ఇద్దరే ముందు గుర్తొస్తారు.


సీతారామయ్యగారి మనవరాలులో మీనాను హీరోయిన్ అనాలా లేదా అనే డౌట్ అందరిలో ఉండేది. తర్వాత జగన్నాటకం, చెంగల్వపూదండ వంటి సినిమాలు చేసింది. ఆ సినిమాలు చూశాక తను హీరోయిన్ గా కష్టమే అన్నవారూ ఉన్నారు. బట్ చంటితో మీనా తెలుగింటి అమ్మాయిగా మారింది. ఓవర్ నైట్ హీరోయిన్ గా స్టార్డమ్ వచ్చింది. చంటితో వెంకటేష్, మీనాల కాంబినేషన్ కు తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ఆ తర్వాత వీరి కలయికలో వచ్చిన ప్రతి సినిమానూ విజయవంతం చేసింది. వెంటనే పార్థహై పార్థ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. తెలుగులో కంటిన్యూస్ గా మూవీస్ చేస్తూ వరుస విజయాలు అందుకుంది. వరుసగా అల్లరి పిల్ల, అల్లరి మొగుడు, సుందరకాండ, ప్రెసిడెంట్ గారి పెళ్లాం.. ఇలా అన్నీ హిట్లే.. దీంతో అప్పటికే టాప్ రేస్ లో ఉన్న రమ్యకృష్ణ, రంభ, రోజాల సరసన చేరిపోయింది.


చంటి తర్వాత ఇవీవీ తీసిన అబ్బాయిగారులో మళ్లీ వెంకటేశ్ తో జోడీ కట్టింది మీనా. అందులో పవర్ ఫుల్ అత్తకు డబుల్ పవర్ ఫుల్ కోడలుగా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చింది మీనా. జయచిత్ర కాంబినేషన్ లో వచ్చే సీన్స్ లో నటిగా ఎలివేట్ అయ్యింది.


మెగాస్టార్ చిరంజీవితోనూ రెండు సినిమాలు చేసింది. ఆ రెంటిలో ముఠామేస్త్రీ లో చేసిన మాసీ కారక్టరే ఆడియన్స్ కు బాగా రిజిష్టర్ అయ్యింది. ముఠామేస్త్రీ తర్వాత చేసిన స్నేహం కోసం టైమ్ కు హీరోయిన్ గా మీనా కెరీర్ క్లైమాక్స్ లో ఉంది. అందుకే అప్పటికీ కాస్త డోస్ పెంచింది. అందుకే ముఠామేస్త్రీ మీనాకు స్నేహం కోసం మీనాకు చాలా తేడాలు కనిపిస్తాయి.

నాగార్జునతోనూ మీనాది హిట్ పెయిర్. ఫస్ట్ మూవీ ప్రెసిడెంట్ గారి పెళ్లాం తర్వాత చేసిన అల్లరి అల్లుడు మాసివ్ హిట్. ఇందులో మీనా పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుంది. అలాగే బాలకృష్ణతో చేసిన సినిమాల్లోనూ సరికొత్త మీనా కనిపిస్తుంది. ఫస్ట్ మూవీ అశ్వమేథం తర్వాత చేసిన బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు,కృష్ణబాబు సినిమాల్లోని అన్ని పాత్రలూ డిఫరెంట్ వే.


మరో వైపు కోలీవుడ్ లోనూ ఇదే మ్యాజిక్ కంటిన్యూ చేసింది. కమల్ హసన్, రజనీకాంత్ లతో పాటు విజయకాంత్ లాంటి హీరోలతో కూడా వరసగా సినిమాలు చేసింది. కమల్ తో చేసిన భామా రుక్మిణి పెద్ద విజయమే అందుకుంది. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన ముత్తు హీరోయిన్ గా తన స్టాయిని పెంచింది.

తెలుగులో టాప్ హీరోయిన్ గానే వెలిగింది మీనా. కాంపిటీషన్ పెరిగినా కాన్ స్టంట్ గా ఉన్న మీనా.. కొత్తతరం వస్తున్నప్పుడు మాత్రం కొంత కన్ఫ్యూజ్ అయింది. అందుకే తన తోటి హీరోయిన్లెంత గ్లామర్ కురిపించినా ఎప్పుడూ భయపడని మీనా.. కొత్తతరం బ్యూటీస్ కు భయపడింది. అందుకే స్నేహం కోసం టైమ్ కు కొన్ని హద్దులు తెంచుకుంది. జెడి చక్రవర్తితో చేసిన పాపే నా ప్రాణం సినిమాలో తనను చూసిన చాలామంది అభిమానులు ఫీలయ్యారు కూడా..


మొత్తంగా గ్లామర్ హీరోయిన్ గా మీనా హవా పాపే నా ప్రాణంతోనే ఆగిపోయింది. ఆ తర్వాత చేసిన తన మార్క్ లో చేసిన మా అన్నయ్య, అమ్మాయి కోసం, దాసు, సింహాచలం, భరతసింహారెడ్డి, స్వామి, పుట్టింటికి రా చెల్లి వంటి సినిమాలన్నీ అవుటాఫ్ గ్లామర్ క్యారెక్టర్సే. పైగా ఈ పాత్రలను రెగ్యులర్ హీరోయిన్ పాత్రలని కూడా అనలేం. పెళ్లి కూడా చేసుకుంది కాబట్టి.. ఆ తర్వాత హీరోయిన్ గా అప్పటికి తన కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్టే అనుకోవచ్చు.


జగపతిబాబు కథానాయకుడు చిత్రంతో మీనా తొలిసారి కాస్త వయసు ముదిరిన పాత్రలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించింది. తరిగొండ వెంగమాంబగానూ మెప్పించింది. ఆ తర్వాత దృశ్యంతో అద్భుతమైన విజయం. దృశ్యం నటిగా మీనా ఆయుష్షును పెంచింది.


దృశ్యం ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఆ తరహా పాత్రలకే పరిమితం కావాలనుకుంది. అంటే ఏదో ఉన్నామంటే ఉన్నాం అని కాకుండా తన పాత్రకూ చాలా ప్రాధాన్యం ఉంటేనే ఒప్పుకోవడం అన్నమాట. అలాగే మళయాలంలో మరోసారి మోహన్ లాల్ తో దృశ్యం లాంటి సినిమానే చేసింది. కానీ అది పెద్ద విజయం కాదు. బట్ దృశ్యంకు సీక్వెల్ గా వచ్చిన దృశ్యం -2 మరోసారి సూపర్ హిట్ గా నిలిచింది. మొత్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఓ దశాబ్ధం పాటు తన నటన, గ్లామర్ తో ఓ వెలుగు వెలిగి.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొత్త టర్న్ తీసుకున్న మీనా ఫ్యూచర్ లో మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ మరోసారి తనుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం..

                                  - బాబురావు. కామళ్ల

Related Posts