దసరా ముగిసింది.. దివాళి మొదలైంది

బాక్సాఫీస్ వద్ద దసరా సందడి దాదాపు ముగిసినట్టే. ఇప్పుడు దివాళి సందడి మొదలవ్వబోతుంది. దివాళి కానుకగా నవంబర్ రెండో వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఛతుర్ముఖ పోరు జరగబోతుంది. అయితే.. వీటిలో తెలుగు నుంచి ఒకే సినిమా ఉండగా.. తమిళం నుంచి రెండు, హిందీ నుంచి ఒక సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరుకు సిద్ధమవుతున్నాయి.

దీపావళి కానుకగా నవంబర్ 10న రాబోతుంది వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ‘. ఇప్పటివరకూ ప్రేమకథా చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వైష్ణవ్ ఈ సినిమాలో ఊర మాస్ లుక్ తో అలరించబోతున్నాడు. వైష్ణవ్ కి జోడీగా శ్రీలీల నటించింది. మలయాళం హీరో జోజు జార్జ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఇక.. ఈమధ్య వరుస హిట్స్ తో మంచి జోరుమీదున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నుంచి ‘ఆదికేశవ‘ సినిమా వస్తోంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించాడు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ‘ఆదికేశవ‘ నుంచి రిలీజైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

పేరుకు తమిళ వాడే అయినా.. సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటూ తెలుగు హీరోలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్ ను ఇక్కడ సొంతం చేసుకున్నాడు కార్తీ. ఈ దివాళి బరిలో కార్తీ నటించిన ‘జపాన్‘ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతుంది. ‘పొన్నియిన్ సెల్వన్‘ సిరీస్, ‘సర్దార్‘ వంటి వరుస హిట్స్ తో ఉన్నాడు కార్తీ. ఇక లేటెస్ట్ గా రిలీజైన ‘జపాన్‘ ట్రైలర్ లో కార్తీ ఎంతో వైవిధ్యంగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో కార్తీ మేకోవర్, స్వాగ్ ఆకట్టుకుంటున్నాయి. కార్తీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ సినిమాలో సునీల్, విజయ్ మిల్టన్ మిగతా పాత్రల్లో సందడి చేయబోతున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికీ సంగీతాన్ని సమకూర్చాడు.

విడుదలకు రెండు, మూడు నెలల ముందు నుంచే ఫుల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు ‘జిగర్తాండ డబుల్ ఎక్స్‘ టీమ్. తొమ్మిదేళ్ల క్రితం కోలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన ‘జిగర్తాండ‘ చిత్రానికి సీక్వెల్ ఇది. ‘జిగర్తాండ‘ చిత్రానికి రీమేక్ గా వచ్చిందే వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్‘. ఇక.. ‘జిగర్తాండ డబుల్ ఎక్స్‘లో లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రలు పోషించారు. పీరియడ్ యాక్షన్ కామెడీగా డబుల్ ఎక్స్ ఎంటర్ టైన్ మెంట్ తో ఈ సినిమాని తీర్చిదిద్దాడట డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. ఈ సినిమా నవంబర్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది.

దీపావళి రోజునే పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు ముస్తాబవుతోన్న పెద్ద సినిమా ‘టైగర్ 3‘. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ఇది. గతంలో ఎక్కువగా నార్త్ సర్కిల్స్ పైనే ఫోకస్ పెట్టిన సల్మాన్.. ‘టైగర్ 3‘తో సౌత్ పైనా స్పెషల్ ఫోకస్ పెట్టాడు. షారుఖ్ ఖాన్ ‘పఠాన్, జవాన్‘ చిత్రాలతో ఇక్కడ భారీ విజయాలు సాధించినట్టే.. ‘టైగర్ 3‘తో ఇక్కడ స్పెషల్ క్రేజ్ సంపాదించుకోవాలనుకుంటున్నాడు సల్మాన్. ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై‘ చిత్రాలకు కొనసాగింపుగా ఈ సినిమా వస్తోంది. అయితే కథ ప్రకారం యశ్ రాజ్ మూవీస్ ‘టైగర్ జిందా హై, వార్, పఠాన్‘ లకు కొనసాగింపుగా ఉండబోతుంది.

Related Posts