‘యాత్ర 2‘లో చంద్రబాబు పాత్ర

పొలిటికల్ హీట్ పెరిగినప్పుడల్లా తమ ప్రచారం కోసం సినీ ఇండస్ట్రీని సైతం వాడుకోవడం సహజంగా జరిగేదే. ఒక పార్టీకి సంబంధించిన నాయకుల ఇతివృత్తంతో సినిమాలు చేయడం.. అందులో అపొజిషన్ పార్టీ వాళ్లను కూడా చూపించడం వంటివి కామన్ గా జరిగేవే. ఈకోవలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ వేడిని దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్న చిత్రం ‘యాత్ర 2‘.

2019 ఎన్నికల సమయానికి రెండు నెలల ముందు ‘యాత్ర‘ సినిమా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ దివంగ‌త ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ మహి.వి.రాఘవ్. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు ‘యాత్ర 2‘ రాబోతుంది. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ‘యాత్ర 2’ తెరకెక్కుతోంది. ‘యాత్ర‘ సినిమాలో రాజశేఖర్ రెడ్డి గా కనిపించిన మమ్ముట్టి సీక్వెల్ లోనూ అదే పాత్రలో అలరించనున్నాడు. జగన్ పాత్రను తమిళ నటుడు జీవా పోషిస్తున్నాడు. అయితే ‘యాత్ర 2‘లో మరో ప్రధాన పాత్ర ఉందట. అదే చంద్రబాబు నాయుడు.

‘యాత్ర 2‘లో చంద్రబాబు పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందట. ఆ రోల్ కోసం బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మహేష్ మంజ్రేకర్ ను తీసుకున్నారట. ఇప్పటికే ‘యాత్ర 2‘లో మంజ్రేకర్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా మొదలైందట.

మహేష్ మంజ్రేకర్ కి తెలుగు సినిమాలు కొత్తేమీ కాదు. ‘ఒక్కడున్నాడు, అదుర్స్‘ వంటి సినిమాలతో ఇక్కడ ప్రేక్షకులకు బాగా పరిచయస్తుడే. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ మహేష్ మంజ్రేకర్ కి మంచి పేరుంది. మరోవైపు మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ తెలుగులో కథానాయికగా బిజీ అవుతోంది.

Related Posts