గోవా తీరంలో మొదలైన ‘దేవర‘

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర‘ షూటింగ్ అస్సలు గ్యాప్ లేకుండా కొనసాగుతోంది. ఇటీవలే హైదరాబాద్ లో ఓ లెందీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ‘దేవర‘.. ప్రస్తుతం గోవాలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే ఎన్టీఆర్ గోవా చేరుకున్నాడు. హీరో ఎన్టీఆర్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ పై.. గోవా తీరంలో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నాడట డైరెక్టర్ కొరటాల శివ.

గోవా షెడ్యూల్ పూర్తైన తర్వాత మరో తీరప్రాంతమైన కర్ణాటకలోని గోకర్ణలో మరో షెడ్యూల్ జరగనుందట. అక్కడ ఇప్పటికే ‘దేవర‘ కోసం ఓ ప్రత్యేకమైన సెట్ ను నిర్మించారట. ఈ నవంబర్ నాటికి ‘దేవర’ మొదటి భాగం టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తిచేసేలా ప్లాన్ చేసిందట టీమ్. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసి 2024, ఏప్రిల్ 5న ‘దేవర ఫస్ట్ పార్ట్‘ను రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాలో దేవర గా టైటిల్ రోల్ లో ఎన్టీఆర్ కనిపిస్తుంటే.. భైరా పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో వంటి నటులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Related Posts