రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో నిరాశ

రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమా విడుదలను ఆపేసిన హైకోర్టు సింగిల్ బెంచ్. సినిమా విడుదల కాకపోవడం వల్ల కోట్లు నష్టం వచ్చిందని పిటిషన్ వేసిన నిర్మాత. సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలన్న హైకోర్టు ధర్మాసనం.

‘వ్యూహం’ చిత్రానికి సంబంధించి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేష బోర్డు ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీ సూచనలను పరిశీలించి.. ఉత్తర్వులు జారీ చేయాలని సింగిల్‌ జడ్జి ధర్మాసనాన్ని ద్వి సభ్య ధర్మాసనం కోరింది. రివ్యూ కమిటీ సూచించిన మార్పులకు సంబంధించిన వివరాలను సింగిల్‌ జడ్జి ముందు ఉంచాలని పిటిషనర్‌ ను ఆదేశించింది. అలాగే 8వ తేదీనే వాదనలు వినాలని, అదే రోజు ఉత్తర్వులు వెలువరించాలని కోరింది.

‘వ్యూహం’ చిత్ర విడుదలకు సెన్సార్‌ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ అమలును ఈ నెల 11వ తేదీ వరకు నిలిపివేస్తూ గత నెల 28న తెలంగాణ హైకోర్టు సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాల్‌ చేస్తూ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ ద్వి సభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ అప్పీల్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌ కుమార్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. నిర్మాత అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని రివ్యూ కమిటీ చెప్పిన సూచనలను పరిశీలించి ఉత్తర్వులు ఇవ్వాలని సింగిల్‌ జడ్జిని కోరింది. అనంతరం అప్పీల్‌ వాదనలను ముగించింది.

Related Posts