‘దేవర‘ కూడా రెండు భాగాలుగా వస్తోంది

ఒకే కథను రెండు భాగాలుగా చెప్పే ఒరవడికి ‘బాహుబలి‘ శ్రీకారం చుడితే ఆ సంప్రదాయాన్ని ‘కె.జి.యఫ్‘ కొనసాగించింది. ఇప్పుడు ‘పుష్ప, సలార్‘ కూడా అదే బాటలో ఉన్నాయి. లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర‘ సినిమాని కూడా రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్టు ప్రకటించాడు డైరెక్టర్ కొరటాల శివ.

‘జనతాగ్యారేజ్‘ వంటి సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర‘. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దేవర‘ సినిమాని తొలుత ఒక భాగంగానే అనుకున్నారు. అయితే భారీ కాన్వాస్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం ఎంతో అద్భుతంగా వస్తోందని.. ఈ చిత్రంలోని ఏ సన్నివేశాన్ని తొలగించాలన్నా కష్టమేనని.. అందుకే ‘దేవర‘ను రెండు భాగాలుగా తీసుకొద్దామని డిసైడయినట్టు కొరటాల తెలిపాడు.

మొదటి భాగాన్ని ముందుగా అనుకున్న ఏప్రిల్ 5, 2024న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. ఇక.. సీక్వెల్ కి సంబంధించిన రిలీజ్ డేట్ ను మాత్రం ఆ తర్వాత ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. సముద్రం నేపథ్యంలో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ‘దేవర‘ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా అలరించనున్నాడు. మొత్తంమీద.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర‘తో డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడన్నమాట.

Related Posts