చంద్రమోహన్ కి చిరంజీవి, బాలకృష్ణ నివాళి

తెలుగు చిత్ర పరిశ్రమలో నేటితరం సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణలకు చంద్రమోహన్ తో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. దశాబ్దాలుగా ఈ ఇద్దరు అగ్ర నటులు చంద్రమోహన్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. చంద్రమోహన్ ఇకలేరు అని తెలియగానే చిరంజీవి, బాలకృష్ణ తమ సందేశాలను అందించారు.

సోషల్ మీడియా వేదికగా చిరు సంతాపం
చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చంద్రమోహన్ గురించి ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.


‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం.

నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు.

ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ , ఆయన కుటుంబ సభ్యులకు , అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.

చంద్రమోహన్ లేని లోటు తీరనిది
తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, సంపూర్ణ నటుడు చంద్రమోహన్ గారు పరమపదించడం ఎంతో విషాదకరం. చంద్రమోహన్ గారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులపై చెరగని ముద్రవేశారు. సాంఘిక, పౌరాణిక పాత్రల పోషణలో ఆయన మేటి. చంద్రమోహన్ గారు, నాన్నగారితో కలసి యుగపురుషుడు, నిండుదంపతులు, ధనమా?దైవమా? ఇలా ఎన్నో చిత్రాలలో చక్కని పాత్రలు పోషించారు. ఆయనతో కలసి ఎన్నో చిత్రాలలో పని చేయడం గొప్ప అనుభూతి. ‘ఆదిత్య 369‘ చిత్రంలో చంద్రమోహన్ గారు తెనాలి రామకృష్ణ కవిగా పోషించిన పాత్ర మరపురానిది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. పరిశ్రమకు ఆయన లేని లోటు తీరనిది. ఆయన ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చంద్రమోహన్ గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
-నందమూరి బాలకృష్ణ

Related Posts