సుమధుర గానకోకిల సుశీల

దశాబ్దాల పాటు తన పాటలతో ప్రేక్షకులను ఓలలాడిస్తూ… సంగీత సామ్రాజ్యాన్నేలిన పాటల రాణి సుశీల. సరసం, శృంగారం, విరహం, విషాదం, ఆనందం, దుంఖం.. సందర్భం ఎలాంటిదైనా, సన్నివేశం మరోలాంటిదైనా అన్ని రకాల భావాలను తన గొంతుతో మెప్పించగల గాయని సుశీల పుట్టినరోజు ఈరోజు (నవంబర్ 13).

చిన్నప్పటి నుంచే సంగీతంలో ప్రవేశం
స్వరకోకిల సుశీల అసలు పేరు పులపాక సుశీల. 1935లో విజయనగరంలో జన్మించారు. తల్లితండ్రుల ప్రోత్సాహంతో విజయనగరం మహారాజా మ్యూజిక్‌ కాలేజ్‌ లో కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో డిప్లోమా చేశారు. ఆపై చెన్నైలో మ్యూజిక్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అప్పటి ప్రసిద్ధ సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు ఓ కొత్త గొంతు కోసం ఆలిండియా రేడియోలో పాటల పోటీ ఏర్పాటుచేశారు. ఆ పోటీలో అగ్రస్థానాన నిలిచారు. ఆ తర్వాత 1952లో పెండ్యాల స్వరసారధ్యంలో ‘కన్నతల్లి’ సినిమాతో గాన ప్రస్థానం ప్రారంభమైంది.

అనతి కాలంలోనే అగ్ర పథానికి సుశీల
సుశీల సినిమా రంగంలోకి వచ్చిన తొలినాళ్లలో పి.లీల, జిక్కి, ఎం.ఎస్‌.రాజేశ్వరి, జమునా రాణి, బాలసరస్వతి దేవి వంటి ప్రముఖ గాయనీమణులతో పోటీ వాతావారణం నెలకొనివుంది. అయినప్పటికీ తన సుమధుర గాత్రంతో రెండు మూడేళ్లలోనే గాయనిగా అగ్రస్థానానికి దూసుకెళ్లారు సుశీల. సాలూరి రాజేశ్వరరావు, కె.వి.మహదేవన్‌, ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ వంటి అలనాటి మేటి సంగీత దర్శకుల సారధ్యంలో మరపురాని పాటలు పాడారు సుశీల.

పలు భాషలలో పల్లవించిన సుశీల గానం
సినీ సంగీత సామ్రాజ్యంలో మహామహులతో కలిసి పనిచేసేన సుశీల.. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లోనే కాక సింహళ భాషలోనూ పాటలు పాడారు. మానవ జీవితంలోని అన్ని ఉద్వేగభరిత సన్నివేశాలకు పాటలు పాడారు ఈ గానకోకిల. పాటలోని సాహిత్యాన్ని ముందుగా ఆస్వాదించి ఆలపించడం సుశీల నైజం.

అటు ఘంటసాల.. ఇటు బాలసుబ్రహ్మణ్యం తో..
మధుర గాయకుడు ఘంటసాల నుండి.. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, జేసుదాసు, ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి వారెందరితోనో స్వరం కలిపారు సుశీల. ఈ గానకోకిల స్వరం నుంచి జాలువారిన పాటల బిందువులన్నీ ఆణిముత్యాలే.

తరతరాల నటీమణులకు సుశీల గాత్రం
పాత్ర స్వభావాన్ని బట్టి.. అలనాటి నటీమణులకు.. వారి వారి స్వర స్థాయిల్లో పాటలు పాడేవారు సుశీల. సావిత్రి, అంజలీదేవి, జమున, సరోజాదేవి, విజయనిర్మల, వాణిశ్రీ వంటి నటీమణులకు సుశీల పాడిన పాటలు.. ఆ పాత్రలకు ప్రాణం పోశాయి. తర్వాతి కాలంలో జయసుధ, శ్రీదేవి, భానుప్రియ, రాధ, రాధిక… ఇలా పలుతరాల కథానాయికలకు పాటలు పాడిన ఘనత సుశీలది. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో నిత్య చైతన్య సంగీత స్ఫూర్తి సుశీల. లాలిపాటలనైనా, వీణపాటలనైనా, అలక పాటనైనా, ఆలాపననైనా, భక్తి గీతమైనా, రక్తి పాటైనా సుశీలమ్మ గొంతులో ఆ పాట సరికొత్త నిండుతనం సంతరించుకుంటుంది.

జాతీయస్థాయిలో ఉత్తమ గాయనిగా
సుశీల గానమాధుర్యానికి ప్రేక్షకుల ఆధరాభిమానాలు, ప్రముఖుల ప్రశంసలతోపాటూ ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. జాతీయస్థాయిలో ఉత్తమ గాయనిగా ఐదుసార్లు అవార్డులందుకున్న సుశీల.. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రభుత్వాల నుంచి అత్యున్నత పురస్కారాలు పొందారు.

Related Posts