తెలుగులో మళ్లీ పరభాషా సంగీత దర్శకులు

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను పరభాషా సంగీత దర్శకులు ఏలారు. కె.వి.మహదేవన్, ఇళయరాజా వంటి పరభాషా సంగీత దర్శకులతో సినిమాలు చేయడానికి టాలీవుడ్ మేకర్స్ పోటీపడేవారు. అయితే.. గత కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు సంగీత దర్శకుల హవా సాగుతూ వచ్చింది. కొన్నాళ్లపాటు టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరికీ మణిశర్మ మోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారితే.. గడిచిన కొన్ని సంవత్సరాలుగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ హవా నడుస్తోంది.

అయితే.. మళ్లీ ఇప్పుడు తెలుగులో పరభాషా సంగీత దర్శకులు పుంజుకుంటున్నారు. ఒక్కొక్కరిగా టాలీవుడ్ స్లాట్స్ అన్నీ ఆక్రమించుకుంటున్నారు. వీరిలో స్టార్ హీరోస్ కి మోస్ట్ ఫేవరెట్ గా మారాడు అనిరుధ్. కొన్ని సందర్భాల్లో స్ట్రెయిట్ మూవీస్ తోనూ మరికొన్ని సందర్భాల్లో అనువాద సినిమాలతోనూ అనిరుధ్ ఇక్కడ ఆడియన్స్ ను మెప్పిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంతో పాటు విజయ్ దేవరకొండ 12వ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అంతేకాకుండా.. ‘ఇండియన్ 2, తలైవర్ 170, 171’ సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతున్నాడు.

మరో తమిళ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ కూడా టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీ అవుతున్నాడు. ‘సార్’ సినిమాతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ సంచలన విజయాన్నందుకున్నాడు. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ తర్వాత తెలుగులో ‘ఆదికేశవ’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇంకా.. ‘జపాన్, తంగలాన్, కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ 21, సూర్య 43’ వంటి మూవీస్ జి.వి. కిట్టీలో ఉన్నాయి.

సంతోష్ నారాయణన్ స్వరపరిచిన ‘దసరా’ సినిమా.. సాంగ్స్ పరంగా, బి.జి.ఎమ్. పరంగా మరో లెవెల్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగులో ‘సైంధవ్, కల్కి 2898 ఎ.డి’ చిత్రాలకు సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. దీపావళి కానుకగా రాబోతున్న’జిగర్తాండ డబుల్ ఎక్స్’కి కూడా సంతోష్ నారాయణే మ్యూజిక్ డైరెక్టర్.

మరో సీనియర్ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీస్ జయరాజ్ కూడా మళ్లీ తెలుగులో బిజీ అవుతున్నాడు. నితిన్ ‘ఎక్స్ ట్రా – ఆర్డినరీ మ్యాన్’ సినిమాతో పాటు నాగశౌర్య 24 సినిమాకీ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. విక్రమ్ హీరోగా నటించిన ‘ధృవ నక్షత్రం’ చిత్రానికి కూడా హ్యారీస్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

తమిళ సంగీత దర్శకులతో పాటు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ కూడా ఇప్పుడు తెలుగులో ఫుల్ బిజీగా మారుతున్నాడు. ‘ఖుషి’తో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హేషమ్.. ప్రస్తుతం ‘హాయ్ నాన్న, స్పార్క్, శర్వా 35’ సినిమాలకు సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ‘హాయ్ నాన్న’ నుంచి రిలీజైన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా నాని మూవీ నుంచి మరో సాంగ్ రాబోతుంది. మొత్తంమీద.. లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ తెలుగులో పరభాషా సంగీత దర్శకుల హవా పెరుగుతుందన్నమాట.

Related Posts